‘చంద్రబాబు, లోకేష్‌ ఊచలు లెక్కబెడతారు’

RK Roja Slams Chandrababu On SCS - Sakshi

సాక్షి, వైజాగ్‌ : ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఊచలు లెక్కబెడతారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువయ్యిందని విశాఖపట్టణంలోని వంచన వ్యతిరేక దీక్షలో సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఐదుగురు ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఏడీఆర్‌ రిపోర్టు చెబుతోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీది దగా కోరుల దీక్ష అంటూ మండిపడ్డారు. కుట్ర రాజకీయాలపై పేటెంట్‌ రైట్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని అన్నారు.

ఏప్రిల్‌ 30(నేడు) టీడీపీల నేతల ఫూల్స్‌ డే అని అభివర్ణించారు. టీడీపీ-బీజేపీలు కలసి రాష్ట్ర ప్రజలను వంచించి మోగించాయని చెప్పారు. రాష్ట్రానికి జీఎస్టీ నుంచి మినహాయింపు తీసుకురాలేని ఆర్థిక మంత్రి
యనమల రామకృష్ణుడు దద్దమ్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై గొడవపడితే జైల్లో పెడతారనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం అనే ప్రదేశం ఎక్కడుందో కూడా బాబుకు తెలియదన్నారు.

పోలవరం ప్రాజెక్టు రైతుల కల అని, దానికి పునాది రాయి వేసింది వైఎస్సార్‌ అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మట్టి, నీళ్లు అందుకున్న చంద్రబాబు వాటిని రాజధాని ప్రాంతంలో చల్లడానికి మాత్రమే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యను ఎలా నియమించారు? సుజనా చౌదరిని అరుణ్‌ జైట్లీ దగ్గరకు ఏ లాలూచీ కోసం పంపారు?. గవర్నర్‌తో గంటన్నర భేటీ అయి ఏ లాలూచీ కోసం ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీపై వరుస ప్రశ్నల వర్షం కురింపించారు.

రాష్ట్రానికి తాను ఏవేవో చేస్తానని చంద్రబాబు వాగ్ధానాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మొద్దని కోరారు. కేంద్రంలో భాగస్వామి అయి కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేని వారు తర్వాత ఏమైనా చేయగలరా? అని ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసేంత వరకూ గ్రామగ్రామాన ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌ సీపీనే అని పునరుద్ఘాటించారు. ‘వైఎస్‌ జగన్‌ యువకుడు. విజన్‌ గల నాయకుడు. పోరాట యోధుడు. ఆంధ్రప్రదేశ్‌ను తప్పకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తారు’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top