ఏం జరిగింది.. ఏం చేద్దాం?

Review of Prajakutami leaders on future activity - Sakshi

పోలింగ్‌ సరళి, భవిష్యత్తు కార్యాచరణపై ప్రజాఫ్రంట్‌ నేతల సమీక్ష 

హాజరైన కుంతియా, ఉత్తమ్, ఎల్‌.రమణ, కోదండరాం 

కూటమిపక్షాల ఓట్ల బదిలీపై చర్చ 

ఫలితాలను బట్టి ఏం చేయాలనే దానిపై కార్యాచరణ 

ఇండిపెండెంట్లు, ఎంఐఎంలు అవసరమైతే ఏం చేయాలన్న దానిపైనా చర్చ 

అన్ని పార్టీలను కలిపి కూటమిని ఒక పార్టీగా గుర్తించాలని గవర్నర్‌కు నివేదించాలనే అభిప్రాయం 

సాక్షి, హైదరాబాద్‌: ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రజాఫ్రంట్‌ నేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఇన్‌చార్జి కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతోపాటు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, అజారుద్దీన్, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌ తదితరులు ఆదివారం సాయంత్రం పార్క్‌ హయాత్‌ హోటల్‌లో సమావేశమై పోలింగ్‌ సరళిని సమీక్షించారు. ఫలితాల అనంతరం ఏం చేయాల న్న దానిపైనా చర్చించారు.

కూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో పరస్పర ఓట్ల బదిలీ ఎలా జరిగిందన్న దానిపై ప్రధానంగా సమీక్షించారు. కూటమి స్ఫూర్తి క్షేత్రస్థాయికి వెళ్లిందని, అన్నిపార్టీల కార్యకర్తలు సమష్టిగానే ఎన్నికల్లో పోరాడారనే అభిప్రాయానికి వచ్చా రు. ఎన్నికల ఫలితాలను బట్టి కూటమిగా ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపై కూడా నేతలు కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తే ఎవరి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని, అన్ని పార్టీలకు ప్రాధాన్యత కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ప్రతికూల ఫలితాలు వస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాలని, అది కూడా కూటమి స్ఫూర్తితోనే సాగాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.  

ఇండిపెండెంట్ల పరిస్థితేంటి... 
సమీక్షలో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలపై కూడా కూటమి నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యం గా ఐదు నుంచి ఏడుగురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో గట్టెక్కే అవకాÔ¶శముందన్న పరిస్థితుల్లో వారిని తమ వైపునకు ఎలా తిప్పుకోవాలన్న దానిపై కూడా చర్చించారు. కూటమి పక్షాన రెబెల్స్‌గా ఉన్న వారు గెలిచినా ఎలాగూ తిరిగి వస్తారని, టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌లోని గెలుపుగుర్రాలను తమ వైపునకు తిప్పుకుని ముందుగానే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై ఉండాలనే చర్చ కూడా జరిగింది. కూటమి పక్షాలు ఆశించిన ఫలితాలు రాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం సహకారం అవసరమయ్యే పక్షంలో ఏం చేద్దామన్న దానిపై కూడా నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో మాట్లాడాలా వద్దా అన్న దానిపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం.  

అందరం ఒక్కటే... 
ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు తమకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మిశ్రమ ఫలితాలు వస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఎలా అడ్డుకోవచ్చన్న దానిపై కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు సొంతంగా మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించిన పక్షంలో గవర్నర్‌ ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందనే అభిప్రాయం భాగస్వామ్య పక్షాల  సమావేశంలో వ్యక్తమైంది. కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ స్థానాలు వస్తే కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ముందుగానే గవర్నర్‌ను కోరాలని ఆయా పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించారు. ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకున్నందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూటమికే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాలని, ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top