సిరిసిల్లను దత్తత తీసుకుంటున్నా | Sakshi
Sakshi News home page

సిరిసిల్లను దత్తత తీసుకుంటున్నా

Published Tue, Nov 27 2018 2:13 AM

Revanth Reddy fires on KCR Govt - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ‘రేవంత్‌ అనే నేను.. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా’అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చినందుకు నాలుగున్నరేళ్లపాటు ప్రజలను దోచుకుతిన్నారని, మళ్లీ ఓట్లేస్తే ఈసారి కోసుకుతింటరని పేర్కొన్నారు. కూతలు, కోతల పోటీల్లో తండ్రీకొడుకుల్లో మొదటి బహుమతి ఎవరికివ్వాలో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి, వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ తరఫున జిల్లాకేంద్రంతోపాటు చందుర్తిలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు. ఓడిపోతే ఫాంహౌస్‌కు పోయే కేసీఆర్‌ను, అమెరికా పోయే కేటీఆర్‌ను తరిమికొట్టాలని కోరారు. వాళ్లిద్దరూ ఓడిపోవాలని కాంగ్రెస్‌ నేతలకంటే ఎక్కువ హరీశ్‌రావుకే ఉందని, కుటుంబ తగాదాలకు శాశ్వత పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌నే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకపోతే పింఛన్లు, బతుకమ్మ చీరల బిల్లులు ఆగుతాయని బెదిరిస్తున్నరని, జిల్లానే తీసుకున్నం.. బిల్లులు తీసుకోమా? అని అన్నారు.  

సోనియమ్మకు దుఃఖం వచ్చింది.. 
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం, బంధువులు కాకులు, గద్దల్లా పీక్కుతింటున్నందుకు సోనియాకు బాధ కలిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలోని అన్ని మూలాల్లో ప్రాజెక్టులు ప్రారంభించి, పూర్తిచేసే సమయంలో దుర్మార్గుడు సీఎం అయ్యి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కల కలగానే మిగిలిపోయిందని సోనియమ్మకు దుఃఖం వచ్చిందన్నారు. నేరెళ్లలో దళితులను లారీల కింద తొక్కించినందుకు, వారిని పోలిస్‌స్టేషన్లలో పెట్టి పశువుల కన్నా హీనంగా కొట్టించి కనీసం పరామర్శకు కూడా రానందుకు సోనియాకు దుఃఖం వచ్చిందని అన్నారు. ‘నిఖార్సయిన సమైక్యవాది హరికృష్ణ చనిపోతే దహన సంస్కారాలకు సీఎం, ఆయన కొడుకు, అల్లుడు హాజరయ్యారు.. కానీ కొండగట్టులో 60 మంది తెలంగాణ ప్రజలు చనిపోతే కనీసం పరామర్శకు కూడా రాలేదు’అని దుయ్యబట్టారు.  బతుకమ్మ పండుగకు చేనేత చీరలిస్తమని చెప్పి రూ.250 కోట్లు ఖర్చు పెట్టి.. అందులో రూ.150 కోట్లు కమీషన్‌ తీసుకొని సూరత్‌ నుంచి సిల్క్‌ చీరలు తెప్పించి ఆడపడుచులకు పంచారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇంకెక్కడికో పారిపోయే వ్యక్తి కావాలా? ఓడినా ప్రజల వెంటే ఉండే వ్యక్తి నాయకుడు కావాలా ఆలోచించాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. ‘ఇంటికో యువకుడు 15 రోజులు సమయం ఇవ్వండి.. డిసెంబర్‌ 7న సీఎం కేసీఆర్‌ ఒక్కఉద్యోగం ఊడగొడితే వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో కేవలం వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది’అని చెప్పారు. ఈ ఎన్నికలు సౌమ్యునికి, అహంకారికి, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని సిరిసిల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. గెలిచాక జర్మనీ వెళ్లి, హాలీడేస్‌లో ఇక్కడికి వచ్చే రమేశ్‌బాబును ఓడించి, తనను గెలిపించాలని కాంగ్రెస్‌ వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ కోరారు.

కొడంగల్‌ ప్రజలు రాజ్యమేలుతారు
కొడంగల్‌: తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే సత్తా కొడంగల్‌ ప్రజలకు ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు రాజ్యమేలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మైండ్‌ సెట్‌ మారిందన్నారు. కేసీఆర్‌వి దింపుడు కల్లం ఆశలని దుయ్యబట్టారు.

Advertisement
Advertisement