దాల్మియాకు ఎర్రకోట

Red Fort adopted under Centre's heritage preservation scheme - Sakshi

నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న దాల్మియా భారత్‌ గ్రూపు

వైఎస్సార్‌ కడప జిల్లా గండికోట బాధ్యతలు కూడా..

ఎర్రకోట నిర్వహణ చేయలేరా: ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు

70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వసతులు దారుణం: తిప్పికొట్టిన బీజేపీ  

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్‌ లిమిటెడ్‌ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి) పథకంలో భాగంగా ఎర్రకోట, వైఎస్సార్‌ కడప జిల్లా ‘గండికోట’ కోట నిర్వహణ బాధ్యతలను నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో దాల్మియా భారత్‌ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద కాలం ఐదేళ్లు.

ఎర్రకోట కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ఇండిగో, జీఎంఆర్‌ గ్రూపులను వెనక్కు నెట్టి రూ. 25కోట్లకు (ఈ మొత్తాన్ని ఎర్రకోట నిర్వహణకు వెచ్చించాలి) దాల్మియా  ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ‘ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు పొందటం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో మేం పనిని ప్రారంభించాలి. భారత్‌తో దాల్మియా బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఈ అవకాశం దోహదపడుతుంది. ఎర్రకోట వైశాల్యంతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే యూరప్‌లోని కొన్ని కట్టడాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఆ పద్ధతిలోనే మేం ఎర్రకోటను ప్రపంచ ఉత్తమ కట్టడాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని దాల్మియా భారత్‌ సిమెంట్స్‌ గ్రూప్‌ సీఈవో మహేంద్ర సింఘీ తెలిపారు. చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్‌ భాగస్వామ్యాన్ని తీసుకువచ్చేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  

70 ఏళ్లు ఏం చేశారు?: కేంద్రం
ఈ పథకంలో భాగస్వాములైన కంపెనీలు కేవలం డబ్బులు ఖర్చుపెట్టి సదుపాయాలను మెరుగుపరుస్తాయే తప్ప.. పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయబోవని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్‌ శర్మ స్పష్టం చేశారు. కట్టడాలను ప్రైవేటీకరించే ఆలోచన అర్థరహితమని పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్‌ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ 70 ఏళ్లుగా ఏం చేసింది? అన్ని కట్టడాలు, వాటిలోని వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వసతులే లేవు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్‌ మినార్‌ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్‌ (తెలంగాణ), కజిరంగా నేషనల్‌ పార్క్‌ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి.

కాంగ్రెస్‌ మండిపాటు
ప్రముఖ కట్టడం  నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. భారత స్వాతంత్య్ర ప్రతీకైన ఎర్రకోట బాధ్యతలను ఇతరులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డాయి. ‘ప్రైవేటు సంస్థకు చారిత్రక కట్టడాన్ని నిర్వహించే బాధ్యతను ఎలా అప్పజెబుతారు? ఇది మీరు (ప్రభుత్వం) చేయలేరా? భారత చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ విధానమేంటి? నిధుల కొరత ఉందా? భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ)కి కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top