కమల్‌తో కటీఫ్‌

rajashekar Goodbye To Kamal - Sakshi

ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు పార్టీకి రాజీనామా

అదే బాటలో మరో ఐదుగురు

గుర్తింపులేదని ఆరోపణ స్థానికానికి కమల్‌ సై

నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీలో అప్పుడే లుకలుకలుప్రారంభమయ్యాయి. పార్టీలో సరైన గుర్తింపు లేదని అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు కమల్‌కు కటీఫ్‌ చెప్పేశారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ వెండితెర వేల్పులుగా ప్రజలు కొలుస్తున్న వారిలో ఎంజీ రామచంద్రన్, శివాజీగణేశన్‌ అగ్రగణ్యులు. వీరిద్దరూ రాజకీయప్రవేశం కూడా చేశారు. అయితే శివాజీ అంతగా రాణించలేకపోయినా, ఎంజీఆర్‌ ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ కాలంలో మాస్‌ ఇమేజ్‌ ఎంజీఆర్‌కు సొంతమైతే, క్లాస్‌ ప్రేక్షకులు శివాజీ సినిమాలకు క్యూకట్టేవారు. అంతలా తమిళ ప్రేక్షకులను వారిద్దరూ పంచుకున్నారు. ఇక వారితరం అంతరించిపోగా, తరువాత తరంలో రజనీకాంత్, కమల్‌హాసన్‌ అదే తరహాలో దూసుకొచ్చారు. వారిలాగానే రజనీకాంత్‌ తెరపై కనపడితే మాస్‌ ప్రేక్షకులు ఊగిపోతారు. భిన్నమైన పాత్రలు, వేషధారణలతో హాలీవుడ్‌నే ఔరా అనిపించేలా నటించిన కమల్‌ అంటే క్లాస్‌ ప్రేక్షకులకు వల్లమాలిన అభిమానం. వెండితెరపై వెలుగులు చిమ్మిన వారు రాజకీయ తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం తమిళనాడులో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పటికే ఎందరో నటీనటులు రాజకీయ అరంగేట్రం చేసి అగ్రస్థానానికి చేరుకోగా తాజాగా రజనీ, కమల్‌ సైతం అదేబాట పట్టారు. ఒకేసారి వెండితెరను పంచుకున్న కమల్, రజనీ రాజకీయాల్లో సైతం అదే తరహాలో ముందుకు వచ్చారు.

సిద్ధాంతాలు వేరైనా.. లక్ష్యం ఒకటే
రజనీ, కమల్‌ పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అధికారంలోకి రావాలనే లక్ష్యం మాత్రం ఒకటే. పార్టీ స్థాపనలో రజనీకాంత్‌ మరికొంతకాలం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కమల్‌ మాత్రం మక్కల్‌ నీది మయ్యంను స్థాపించి ప్రజల్లోకివెళ్లడం ప్రారంభించేశారు.  ఇదిలా ఉండగా, పార్టీ నిర్మాణంలో భాగంగా 14 ఉన్నతస్థాయి కమిటీలను కమల్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో న్యాయవాది రాజశేఖర్‌ ఒకరు. కాంగ్రెస్‌ పార్టీలో సీడి మెయ్యప్పన్‌ అనుచరుడిగా ఉండిన రాజశేఖర్‌ ఆ తరువాత టీటీవీ దినకరన్‌ పంచన చేరారు. కొంతకాలం దినకరన్‌ వెంట నడిచి కమల్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యంలో చేరారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏజీ మవురియా, స్టార్‌ జెరాక్స్‌ సౌరిరాజన్‌ తదితరులు రాజశేఖర్‌ను కమల్‌కు పరిచం చేయడంతో ఉన్నతస్థాయి కమిటీలో సభ్యత్వం లభించింది. అయితే, రాజశేఖర్‌ మూడురోజుల క్రితం కమల్‌హాసన్‌ను స్వయంగా కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నిర్ణయంపై రాజశేఖర్‌ వివరణ ఇచ్చారు. ‘పార్టీ స్థాపన నుంచి కమల్‌ వెంటే ఉంటూ శ్రమించాను.

ఉన్నతస్థాయి కమిటీలోని 14 మందిలో ఐదుగురు నావారే. ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిచడం ప్రారంభమైంది. పార్టీ పనుల కోసం సమయం కేటాయించడం వీలుకావడం లేదు. నా కక్షిదారులు కోపగించుకోవడం వల్ల న్యాయవాద వృత్తి దెబ్బతినింది. అందుకనే కమల్‌ పార్టీకి రాజీనామా చేశా’’ అని వివరించారు. రాజశేఖర్‌ రాజీనామా వల్ల మక్కల్‌ నీది మయ్యంలోని ఆయన అనుచరులు సైతం వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్థానికానికి సై : కమల్‌
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తలపడేందుకు తమ పార్టీ సిద్ధమని కమల్‌ ప్రకటించారు. రెండు నెలల కిత్రం మదురైలో బహిరంగసభ తరువాత మంగళవారం చెన్నై మోడల్‌ గ్రామసభను నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండే భూమిని సిద్ధం చేస్తున్నానని చెప్పారు. గ్రామసభల ఆవశ్యకతను ఈ ప్రభుత్వానికి తెలియజెప్పడమే ఈనాటి కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. స్థానిక పరిపాలనే తమ బలమని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీచేసేందుకు మక్కల్‌ నీది మయ్యం సిద్ధంగా ఉందని చెప్పారు. అవినీతిని ఒక్కసారిగా రూపుమాపలేమని, తగ్గించుకుంటూ పోయి చివరకు పూర్తిగా లేకుండా చేయడమే తన పార్టీ ధ్యేయమని అన్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో నిందితులు ఎవరైనా న్యాయస్థానం ముందు శిక్షపడేలా చేయాలని ఆయన కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top