నాయకులు @ బెజవాడ

Political Leaders Of AP Made Special Arrangements In Hotels For Watching Results With Relatives2019 - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : కౌంటింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే గడువుంది. పోలింగ్‌కు కౌంటింగ్‌కు 43 రోజుల సుధీర్ఘ విరామం రావడంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిని ఈ ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? ఏ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుంది అనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. 
విజయవాడలో మకాం..
మే 23న కౌంటింగ్‌ 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రంలో కూర్చునే ఏజెంట్లు ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంట్లను ఇతర పార్టీ నాయకులు అపహరించకుండా జాగ్రత్తగా  చూసుకుంటున్నారు. మూడురోజుల ముందు నుంచి వారికి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్‌కి సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో, విజయవాడ పార్లమెంట్‌కు పెనమలూరులోని ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. 
లాడ్జీలు, హోటళ్లలో గదులు నిల్‌..
నాయకులు వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్‌ రోజు విజయవాడలో ఉండేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌ సీపీ, టీడీపీ కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లు, పలు గెస్ట్‌ హౌస్‌లు ముందస్తు బుకింగ్‌ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు శుభకార్యాలు తోడవడంతో లాడ్జీల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. పనిలో పనిగా డిమాండ్‌ భారీగా ఉండడంతో అద్దెలు కూడా పెంచేస్తున్నారు. 
పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌ హౌస్‌లలోని కాన్ఫరెన్స్‌ హాళ్లలో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్నేహితులంతా ఒక చోట చేరి ఫలితాలు వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే పందెం రాయుళ్లు కూడా ఫలితాల వీక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారు ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. 
పండుగ చేసుకునేందుకు..
కౌంటింగ్‌ పూర్తయ్యి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా తెలియనుంది. అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందో వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు గెలుపు సంబరాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.         

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top