80% మోదీ మ్యాజిక్‌

PM's marathon 51-day campaign sees 142 rallies - Sakshi

ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల అధినేతల ర్యాలీలు, సభల నిర్వహణకు నియోజకవర్గాలను ఎంపిక చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఒక ప్రాంతంలో సభని నిర్వహిస్తే, దానికి జన సమీకరణే కాదు, ఆ తర్వాత ఓట్లు రాబట్టుకోగలగాలి. ఎన్నికల ర్యాలీల ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాలకు తిరుగేలేదు. ఉన్న కాస్త సమయంలోనే ఆయన పక్కాగా, ప్రణాళికా బద్ధంగా దేశవ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వాటిలో ఏకంగా 114 స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అంటే సక్సెస్‌ రేటు 80శాతంగా ఉంది. మోదీ తన ప్రచార సభల్లో మూడోవంతు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ల్లో నిర్వహించి అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు.

గతేడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ 27 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. అంటే గెలుపు రేటు 48శాతంగా ఉంది. ఏడాది తిరిగే సరికల్లా లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సక్సెస్‌ రేటు రెట్టింపైంది. హిందీ రాష్ట్రాలైన, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహా ర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల్లో మోదీ 60 ర్యాలీలు నిర్వహిస్తే మొత్తంగా క్లీన్‌స్వీప్‌ చేసింది. యూపీలో 30 లోక్‌సభ నియోజకవర్గాల్లో మోదీ ర్యాలీల్లో పాల్గొంటే 23 సీట్లలో బీజేపీ నెగ్గింది. ఇక కేరళ, తమిళనాడుల్లో మోదీ అయిదు ర్యాలీల్లో పాల్గొంటే ఎన్డీయే కూటమి కి ఒక్క సీటు మాత్రమే వచ్చింది.  

రాహుల్‌పై మళ్లీ అదే ముద్ర!
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కొన్నాళ్ల కిందటి వరకు ఐరన్‌ లెగ్‌ ముద్ర ఉండేది. ఆయన ఎవరికి ప్రచారం చేస్తే వారు ఓడిపోతారన్న భావన అందరిలోనూ నెలకొంది. గతేడాది హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో రాహుల్‌ తనపై ఉన్న పప్పూ ముద్రను తొలగించుకున్నారని ఆయన అభిమానులు ఆనందించారు. కానీ ఇంతలోనే అది కాస్తా తారుమారైంది. రాహుల్‌ 115 నియోజకవర్గాల్లో పర్యటిస్తే యూపీఏ 96 సీట్లలో ఓడిపోయింది. ఆయన గెలుపు 17శాతం దగ్గరే నిలిచిపోయింది.   

తుస్సుమన్న బ్రహ్మాస్త్రం
ఇక కాంగ్రెస్‌ పార్టీ తన అమ్ముల పొదిలోంచి ఎన్నికలకు మూడు నెలల ముందు తీసిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ 38 నియోజక వర్గాల్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. 44 ర్యాలీల్లో పాల్గొన్నారు. 26 ర్యాలీలు యూపీలో నిర్వహిస్తే, మిగిలినవి మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, హరియాణాల్లో పార్టీ అభ్యర్థులు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. కానీ అన్న రాహుల్‌ పాటి సక్సెస్‌ను కూడా ఆమె సాధించలేకపోయారు. ప్రియాంక ప్రచారం చేసిన స్థానాల్లో రెండంటే రెండు అదీ అమ్మ, అన్న మాత్రమే గెలిచారు. రాయ్‌బరేలి, వయనాడ్‌ల్లో సోనియా, రాహుల్‌ మినహా మరెవరూ గెలవలేకపోయారు. వాస్తవానికి ప్రియాంక ప్రచారం పార్టీకి కొత్తగా ఒనగూర్చే ప్రయోజనం ఏమీ లేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top