
ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంటలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అయ్యా.. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్నాం.. ఏ సంక్షేమ పథకాన్నీ మా దరిదాపులకు రానీయకుండా ఈ పాలకులు మాకు చుక్కలు చూపిస్తున్నారు.. 65 ఏళ్లు దాటినా పింఛన్ లేదంటున్నారు.. భర్త చనిపోయినా.. రాదు పొమ్మంటున్నారు.. కరెంటు బిల్లులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. చెల్లించడం ఒక్కరోజు ఆలస్యమైనా పెనాల్టీలతో పెనుభారంమోపుతున్నారు’ అంటూ పలువురు కూలీలు, మహిళలు, వృద్ధులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పదో రోజు గురువారం కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, పెద్ద చింతకుంట, భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్, కొండాపురం, దొర్నిపాడు గ్రామాల మీదుగా సాగింది. ఆళ్లగడ్డలో ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన యాత్ర సాయంత్రం 5.20కు దొర్నిపాడు వద్ద ముగిసింది. వైఎస్ జగన్ పదో రోజు మొత్తం 13.2 కి.మీ నడిచారు. పెద్ద చింతకుంటలో ముస్లింలు వైఎస్ జగన్‌ను కలిసి తమకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని కోరారు. బాలసదనంలోని చిన్నారులు రోడ్డుపైకి వచ్చి తనకోసం వేచి ఉండటాన్ని గమనించి జగన్ వారిని పలకరించారు. రోడ్డుపైకి రాలేక పాఠశాల వద్దే వేచి ఉన్న విద్యార్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.