నాడు ఎగతాళి.. నేడు చంద్రబాబు చేసేదేంటి?

Peddireddy Mithun Reddy Slams Chandrababu Over AP Special Status - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మొదట్నుంచీ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉందని, టీడీపీ అప్పుడే కళ్లు తెరిచి ఉంటే ఏపీకి ప్రయోజనం కలిగేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో ఎంత విలువ ఉందో మొన్నటి అవిశ్వాస తీర్మానం సమయంలో దేశం మొత్తానికి తెలిసిందని ఎద్దేవా చేశారు. హోదా అనేది టీడీపీ వ్యక్తిగత విషయం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశమన్నారు. ఈ సారి ప్రజలు ఎట్టి పరిస్థిత్తుల్లోనూ చంద్రబాబును నమ్మరని, ఏపీలో వైఎస్సార్‌సీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని మిథున్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఏపీ ప్రయోజనాలు, విభజనచట్టం, ప్రత్యేక హోదా లాంటి పలు కీలక అంశాలపై మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో హోదా సాధిస్తాం
హోదా విషయంలో మేం రాజకీయాలు పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయగానే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఎగతాళి చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశం బీజేపీకి లేదు. హోదా వల్ల అనేక పరిశ్రమలొస్తాయి. యువతకు ఉపాధి పెరుగుతుంది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఉత్తరాఖండ్‌లో పరిశ్రమలు స్థాపించి రాయితీల ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం చేసే బదులు పందుల పోటీ పెట్టుకోండంటూ నాడు సుజనా చౌదరి ఎగతాళి చేశారు. మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్‌సీపీనే. హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం. హోదా సాధన విషయంలో వైఎస్‌ జగన్‌ స్పష్టంగా ఉన్నారు. ప్రజలందరి మద్దతుతో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో హోదా సాధించి తీరుతాం. వైఎస్‌ జగన్ ఒకే మాటపై నిలిచే వ్యక్తి. సభలో ఏ పార్టీ కూడా చంద్రబాబు వాదనకు మద్దతివ్వలేదు. రాహుల్‌ గాంధీ కూడా దాటవేసే ధోరణిలో మాట్లాడారు. మేం మాత్రం నిరంతరం హోదా కోసం డిమాండ్‌ కొనసాగించడం వల్ల దేశ వ్యాప్తంగా హోదాపై చర్చ జరుగుతోంది. 

నిద్రలేచిన టీడీపీ ఇప్పుడు నాటకాలు
కుప్పంలో అరాచకం రాజ్యమేలుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ప్రధాని మోదీ ఉచ్చు, ట్రాప్‌ అంటూ శ్రతువులన్నట్లుగా మాట్లాడారు. కానీ గత సమావేశాల్లో మేం 13సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ పారిపోయింది. మరోవైపు ఆనాడు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించారు. పార్లమెంట్లో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదనే విషయం మాకు తెలిసింది. నాలుగేళ్ల నుంచి పార్లమెంట్‌లో మేం హోదాపై మాట్లాడుతున్నామని, ఇప్పుడు నిద్రలేచి టీడీపీ హోదా అని నాటకాలు ఆడుతోంది. మేం మాత్రం ఎంపీ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి.. ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించాం. మేం రాజీనామాలు చేశామన్న కోపం ప్రధాని మోదీ మాటల్లో కనిపించింది. 

టీడీపీ-బీజేపీలు మిత్రులే
బీజేపీతో ఎవరు క్లోజ్‌గా ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు మా మిత్రుడేనని సభలో స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఎప్పుడూ రెండు ఆప్షన్లతో ముందుకెళ్తాడు. పొత్తుకోసం బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నా ఘనతే అని చెప్పుకునే మనస్తత్వం చంద్రబాబుది. మాట ఇస్తే కమిట్‌మెంట్‌తో ఉండే మనస్తత్వం వైఎస్‌ జగన్‌ది. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు హోదా కోసం మాట్లాడలేకపోయారు. తప్పును ఒప్పు చేయడంతో, ఒప్పును తప్పు చేయడంలో బాబు నేర్పరి. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అందుకే హోదా కోసం అడగలేదు. నాలుగేళ్లుగా స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఒక్క లేక రాయలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కడపకు స్టీల్ ప్లాంట్‌ వస్తుంది. హోదా కోసం రాజకీయాలు వద్దు.. అందరం కలిసి పోరాడుదాం.

చంద్రబాబు 5 సంతకాల మాటేంటి?
సీఎం కాగానే చంద్రబాబు 5 సంతకాలు చేశారు. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు, బెల్ట్‌ షాపులు సహా ఏ హామీలు కూడా అమలు కాలేదు. అసలు 5 సంతకాలు చంద్రబాబుకు గుర్తున్నాయో.. లేదో..! 600 హామీలున్న మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్లో లేకుండా చేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు, దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని టీడీపీ అబద్ధాలు చెబుతోంది. అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారని పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top