
సాక్షి, గుంటూరు : ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగువాడి తెగింపు కేంద్ర ప్రభుత్వానికి తెలియాలని అన్నారు. గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ఈ మేరకు ప్రత్యేక హోదాపై ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం గత నాలుగేళ్లుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపులేకుండా పోరాడుతున్న సంగతి తెలిసిందే. హోదా అంశాన్ని మరుగునపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ హోదా కోసం గట్టిగా పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా ఏకమై కదులుతున్న నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు కూడా హోదా రాగాన్ని అందుకున్నారు. నాడు ప్యాకేజీని ఒప్పుకున్న చంద్రబాబు నేడు హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం పేరిట కొత్త స్ర్కీన్‌ప్లే మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కూడా హోదా పోరాటాన్ని చేస్తాననడం గమనార్హం. జనసేన ఆవిర్భావ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన పవన్ ప్రధానంగా టీడీపీపై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పార్టీ అవినీతిపై తొలిసారి తీవ్రంగా విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
అన్ని కులాలకు అధికారం కావాలి?
ప్రజలను కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వంతో నేను స్నేహం చేయను. ఉద్దానం గురించి చెప్పడానికి పవన్ రావాలా? అక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేల కళ్లకు కనపడలేదా? అందరూ ఉద్దానం బాధితులు బాగానే ఉన్నారని ఇప్పుడు అనుకుంటారు. కానీ ఏం జరగలేదు. కొంతే జరిగింది అక్కడ. అభివృద్ధి అనేది కొందరికి కాదు అందరికి. అధికారం కొందరికేనా కొన్ని కులాల గుప్పిట్లోనేనా. కుదరదు. అన్ని కులాలకు చాలా మార్పులు వచ్చి తీరాలి. అలాంటి మార్పులు వచ్చే వరకూ పోరాటం సాగుతుంది.
ఆ కేసులో మీ అబ్బాయి పేరు!
శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి (లోకేశ్) పేరుందంటారు. వాస్తవాలు తెలియదు నాకు. దాదాపు లక్ష తొంభై వేల కోట్లతో బడ్జెట్ పెట్టారు. ఒక చిన్న ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడితే ఆరు అబద్దాలు మాకు వినిపిస్తున్నాయి. మీరు ప్రజలకు బుద్ధి ఉండదు, వాళ్లు షుంఠలు అని అనుకుంటున్నారా? మీ విధానాలను చూస్తే జాలి పడుతున్నాను. నువ్వేం చేస్తున్నావని మీరంటే.. నేను సీఎం కొడుకును కాదు. యంత్రాంగం నా వెనుక నడవదు. ఎవరైనా సాయం చేస్తే సభలు నడుపుకుంటున్నాం. ఇప్పటివరకూ ఎవరినీ ఒక కాంట్రాక్టు అడగలేదు. నేను అడుగుతుంది ఒక్కటే ప్రజలకు న్యాయం చేయమని. మీ మీద ఓటుకు నోటు ఆరోపణలు వచ్చినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. ఆ రోజున నేనెందుకు మద్దుతు తెలిపానంటే టీడీపీ వాళ్లలో సీనియర్లు ఉన్నారని చూశాను.
ఓటుకు నోటుపై కొంచెం తగ్గి ఒత్తిడి పెంచకూడదని మాట్లాడలేదు. ఈ రోజుకు కూడా మీ బుద్ది మారలేదు. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేను దీన్ని ఆశించలేదు. ఇసుక మాఫియా గురించి మీరెమన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి గురించి మీరెన్ని కథలు రాశారు. మరి ఆయనది తప్పైతే.. ఇసుక మాఫియాలో మీరు చేస్తుందేంటి. ఎర్రచందనం విషయంలో చేస్తుంది తప్పుకాదా. అక్కడున్న అటవీ యంత్రాంగాన్ని ఎందుకు పటిష్టం చేయడం లేదు. ఏపీ విభజన అనంతరం రాష్ట్రాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు. మీరందరూ తెలుగు తల్లికి ద్రోహం చేశారు. ఆమె శాపం మీకు తగలితీరుతుంది. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు. విశాఖలో ఘోరంగా కబ్జాలు జరిగాయి. ఓ పెద్దాయన నా దగ్గర చాలా బాధపడ్డారు. ఒకటా రెండా పుంకానుపుంఖాలుగా మీ అవినీతి బయటకు వస్తున్నాయి. మీ తప్పుడు విధానాలకు అంతులేదా? ఈ రోజు నుంచి జనసేన నుంచి జనసేన సైనికులు, ప్రజలు మీపై పోరాటానికి సిద్ధం అవుతున్నాం. ఏపీ రాజకీయ వ్యవస్థ చాలా బలంగా మారబోతోంది. సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి
ఆగష్టు 14న జనసేన మ్యానిఫెస్టో
ఆగష్టు 14న జనసేన మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. దాన్ని బట్టి విధానాలను అర్థం చేసుకోవచ్చు. మత్య్సకారులు మమ్మల్ని ఎస్టీల్లో చేర్చమని కోరుతున్నారు. అలాగే కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అది సాధ్యపడేదా? ప్రజలను మభ్యపెట్టి తూతూమంత్రంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. అది అక్కడ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంది. ఇవన్నీ చేయలేమని తెలిసి కూడా రాజకీయాలు చేశారు. ఎవరికి ఏం కావాలో అన్నీ జనసేన చేస్తుంది. ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రతను కల్పిస్తే చాలూ ప్రజలు హాయిగా జీవిస్తారు. కులాల మధ్య ఐక్యతను జనసేన సాధిస్తుంది. కులాలను జనసేన విభజించదు.
ఇద్దరు క్రిస్టియన్లు.. ఇద్దరు హిందువులు!
నేను ప్రజలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడను. వాళ్లందరూ నా కుటుంబం. నా పిల్లల్లో ఇద్దరు క్రిస్టియన్లు. ఇద్దరు హిందూవులు. మరి నా జీవితం అలా జరిగింది. నేను ప్లాన్ చేయలేదు. ఏదో ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకును.. పొద్దున కూడా నా కడుపు తిప్పేసింది ఏం మాట్లాడాలా? అని. నేను మహా అయితే చిన్న రైతును అయ్యేవాడినేమో. యాధృచ్చికంగానే రాజకీయాల్లోకి ప్రవేశించాను.
కేంద్రం అంటే భయంలేదు
కేంద్ర ప్రభుత్వం అంటే తనకు భయం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్రంలోని పెద్దలకు అర్థమయ్యేందుకు అంటూ.. మొదట ఆంగ్లంలో ప్రసంగించిన ‘మై నేమ్ ఈజ్ పవన్ కల్యాణ్..’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి.. దానిని నెరవేర్చకపోవడం తనకు తీవ్రంగా బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రజల సెంటిమెంట్ ఆధారంగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారని, అలా అయితే, ఏ సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 25 మంది ఎంపీలతో 5 కోట్ల ఆంధ్ర ప్రజలను కంట్రోల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందని, అది సాధ్యం కాదని అన్నారు. ప్రత్యేక హోదా ఆర్థిక విషయం కాదని, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. కేంద్రం చేసే చట్టాలు మాకేనా.. మీకు వర్తించావా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారని, ఆ సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రత్యేక హోదా హామీని ఇచ్చారని గుర్తుచేశారు.