
అభివాదం చేస్తున్న పవన్‌కల్యాణ్, మాయావతి
తిరుపతి సిటీ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాలో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా మరచిపోయారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం బీఎస్‌పీ, జనసేన యుద్ధభేరి ప్రచార సభ నిర్వహించారు. బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగించారు. బీఎస్‌పీ పార్టీ తరఫున చిత్తూరు, నెల్లూ రు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పోటీ చేస్తు న్న అభ్యర్థులు వేదిక మీద ఆశీనులయ్యా రు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభ్యర్థులను పరిచయం చేస్తూ ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి పేరును వేదికపై ఉన్న నాయకులను అడిగే తెలు సుకున్నారు. పార్టీ అధ్యక్షుడికే అభ్యర్థుల పేర్లు తెలియకపోవడం సభకు హాజరైన జనం నవ్వుకున్నారు.
తిరుపతి నుంచి పోటీ చేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి పేరు మినహా మిగిలిన అందరి పేర్లను పక్కవారిని అడిగి తెలుసుకుని చెప్పారు. ఒక దశలో గంగాధరనెల్లూరు నుంచి తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయారు. దీంతో ఆయన్ను పరిచయం చేయలేకపోయారు. దీంతో జీడీ నెల్లూరులో పోటీలో ఉన్న అభ్యర్థి పవన్ వద్దకు వచ్చి పేరు చెప్పడంతో గెలిపించాలని కోరారు. మదనపల్లినుంచి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగారపు స్వాతి అని చెప్పారు. దీంతో పక్కనున్న నాయకులు సర్దిచెప్పడంతో మదనపల్లె అభ్యర్థి అని మరోసారి చెప్పారు. కుప్పంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకటరమణకు ఓట్లు వేయమని టీడీపీ అధినేత చంద్రబాబుకు విన్నపంగా చెప్పారు.
ఆకట్టుకోని పవన్ ప్రసంగం
తిరుపతి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అంతా ఆవేశం తప్ప, జనాన్ని ఆలోచింపజేసే అంశాలు ఏవీ మాట్లాడలేదు. జనసేన నాయకులు రాయించిన తిరుపతిలో ఉన్న సమస్యలను కూడా చదివే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయింది.
సభ ప్రారంభానికి ముందే వెనుతిరిగిన ప్రజలు
మధ్యాహ్నాం రెండు గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పి ఒంటి గంట కల్లా జనాన్ని ఎస్వీయూ క్రీడా మైదానానికి తరలించారు. ఒక పక్క ఎండను తట్టుకోలేక ప్రజలు అవస్థలు పడ్డారు. నాలుగున్నర గంటల పాటు వేచి వుండలేక ప్రజలు పవన్ కల్యాణ్ వచ్చే సమయానికి మూడింతల జనం వెనుదిరిగిపోయారు. ఏట్టకేలకు సాయంత్రం 4.28 గంటలకు సభ ప్రాంగణం పైకి బీఎస్‌పీ అధినేత్రి మాయవతి, పవన్ కల్యాణ్ వచ్చి ఆశీనులయ్యారు. యువకులు మెజార్టీ సంఖ్యలో వేదికకు మూడు వైపుల నిలబడి పవన్ కల్యాణ్ ప్రసంగానికి కేకలు వేశారు.
అయితే భారీగా జనం వస్తారని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మైదానంలోకి వచ్చే అన్ని దారుల్లో మెటల్ డిటక్టర్లు కూడా పెట్టారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి ట్రాఫిక్‌ను కూడా మళ్లించారు. ఈ సభలో బీఎస్‌పీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, బీఎస్‌పీ రాష్ట్ర్‌ర కార్యదర్శి ప్రభాకర్, జనసేన నాయకులు డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ చదలవాడ సుచరిత, ఆకేపాటి సుభాషిణి, రాజారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.