
సాక్షి, హైదరాబాద్ : అధికార పార్టీ టీడీపీ, ఆ పార్టీకి కొమ్ముకాస్తూ.. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న ఒక వర్గం మీడియాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో సంచలనం రేపుతున్నారు. ఎదుటివారిపై దాడి చేయడమే టీడీపీ సిద్ధాంతమని, దేవుడిని నమ్ముతామని అమెరికా రాజ్యాంగ పీఠికలో చెప్పుకుంటే.. ఎదుటివారిపై దాడే మార్గమని టీడీపీ పీఠికలో ఉందని పవన్ ఎద్దేవా చేశారు. టీడీపీలో ఈ సిద్ధాంతానికి రూపకర్త బూతుజ్యోతిరత్న ‘ఆర్కే’నే అంటూ నిప్పులు చెరిగారు.
కొందరు బహిరంగంగా దూషిస్తూ.. వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తామంటే తన దగ్గర నడవదని అన్నారు. గత ఆరు నెలలుగా తనను, తన కుటుంబాన్ని, తన పార్టీ కార్యకర్తలను, తనకు మద్దతిచ్చేవారిని, చివరికీ మా అమ్మను కూడా దూషించారని, చేయాల్సిదంతా చేసి.. వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తామంటూ కొందరు సంకేతాలు ఇస్తున్నారని పవన్ మండిపడ్డారు. మనల్ని, మన తల్లులను, ఆడపడుచులను తిట్టే పేపర్లను ఎందుకు చూడాలి? వాళ్ల టీవీలను మనమెందుకు చూడాలి? అని పవన్ పేర్కొన్నారు. జర్నలిజం విలువలతో ఉన్న చానల్స్, పత్రికలకు మద్దతుగా నిలబడతామని తెలిపారు.
ఇలా ఎమోషనల్ అత్యాచారానికి పాల్పడే వారిని నిరోధించేందుకు ఎలాంటి నిర్భయ చట్టాలు రావాలి? బాబుకు ఢంకా భజయిస్తున్న ఆ ‘మూడు’ చానెళ్లను నడుపుతుందెవరు?అని పవన్ ట్వీట్ చేశారు. శ్రీసిటీలో వాటాల గురించి సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తే.. టీవీ9 ఓనర్ శ్రీనిరాజు లీగల్ నోటీసులు ఎందుకు పంపిస్తారని ఆయన ప్రశ్నించారు. వారిద్దరి మధ్య ఉన్న ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు. ఏప్రిల్ 23, 2009న టీడీపీకి వచ్చిన డొనేషన్లలో కోటిరూపాయలు శ్రీనివాసరాజు చలపతి పేరిట ఉన్నాయని, జుబ్లీహిల్స్‌కు చెందిన ఈ శ్రీనివాసరాజు ఎవరు? అని పవన్ ప్రశ్నించారు.