చంద్రబాబుది ద్వంద్వ వైఖరి

Pawan Kalyan fires on Chandrababu and TDP MPs - Sakshi

రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మాట మారుస్తున్నారు

బీజేపీతో సమానంగా టీడీపీ కూడా దారుణంగా దెబ్బతీసింది

‘దేశం’ నేతలకు కాలానుగుణంగా మతిమరుపు

ముఖ్యమంత్రిపై పవన్‌కల్యాణ్‌ ధ్వజం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా విభజన హామీల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వంలో పాలన చేస్తున్న వారే విభజన హామీల అమలులో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. వారి రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మాటలు మారుస్తున్నారనేది వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో సమానంగా రాష్టంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బ తీసింది.

ఒకవైపు టీడీపీ ఎంపీలు బీజేపీని తిడతారు.. మరోవైపు బీజేపీ కాళ్లు మొక్కుతారు.. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌..చంద్రబాబు మా మిత్రుడే అని లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి చేస్తున్నది ధర్మ పోరాటం అని ఎలా నమ్మగలం’ అని పవన్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. హోదా సాధన, విభజన చట్టంలోని హామీల అమలు కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు. 

సమయానుకూలంగా టీడీపీ నేతలకు మతిమరుపు
గజని సినిమాలో హీరోకు స్వల్పకాలపు మతిమరుపు వ్యాధి ఉన్న తరహాలోనే టీడీపీ నేతలు సమయానుకూలంగా మతిమరుపును అలవాటు చేసుకున్నారంటూ పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌ ద్వారా వ్యాఖ్యానించారు. లోక్‌సభలో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌.. 2017 మార్చి 12న ‘హోదా కన్నా ప్యాకేజీ బెటర్‌’ అంటూ వ్యాఖ్యాలు చేసిన విషయాన్ని అంగ్ల దినపత్రిక హిందూ ప్రచురించిన కథనాన్ని పవన్‌ ఈ సందర్భంగా ఉదహరించారు. బీజేపీకి నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేశారన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీని వెనుకేసుకు రావడంవల్ల తమకొచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top