రాజ్యసభ సీటు ఇస్తానని బాబు మోసం చేశారు | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సీటు ఇస్తానని బాబు మోసం చేశారు

Published Mon, Jul 23 2018 2:35 AM

Pawan Kalyan sensational comments on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ పెట్టి చంద్రబాబు తనను మోసం చేశారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. గత ఎన్నికలకు ముందే తాను 2012లోనే రాజకీయాలపై మాట్లాడేందుకు చంద్రబాబును కలిసినట్టు చెప్పారు. అప్పుడే రాజకీయ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 60–70 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయనకు చెప్పానన్నారు.

మీరు పార్టీపెట్టి విడిగా పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయని, ఆ ఆలోచన చేయవద్దని చంద్రబాబు అప్పట్లో తనకు సూచించారన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చెప్పారని, మరుసటి రోజు అదే విషయాన్ని రెండు పత్రికల్లో రాయించారని తప్పుపట్టారు. అప్పడే చంద్రబాబుపైన, టీడీపీపైన నమ్మకం పోయిందన్నారు. ఆ పార్టీకి దండం పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్రమోదీని కలిసినట్టు చెప్పారు. అప్పట్లో తాను 60–70 సీట్లలో పోటీచేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం తనకు ఉండేదన్నారు. 

లోకేశ్‌ సీఎం అయితే రాష్ట్రం ఏమవుద్దో
రాష్ట్రంలో వేలాది ఎకరాల భూసేకరణ జరుగుతుందిగాని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మాత్రం లేనేలేదన్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ ఒక్కరికే ఉద్యోగం వస్తే సరిపోద్దా.. రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. భవిష్యత్‌లో లోకేష్‌ సీఎం అయినా తనకేమీ అభ్యంతరం లేదు కానీ, ఆయన సీఎం అయితే మాత్రం రాష్ట్రం ఏమవుతుందో అనేదే తన భయమన్నారు. లోకేష్‌ సీఎం అయితే రాష్ట్రంలో భూముల పరిస్థితి ఏమిటోనని భయపడుతున్నానని చెప్పారు. తనను అనుభవం లేని రాజకీయ నాయకుడిని అంటున్నారని.. తనను విమర్శించే వారు రాజకీయ అనుభవంతోనే పుట్టారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కిందపడతాం, పైన ఎక్కుతాం, ఆఖరికి జనసేన పార్టీ అధికారం సాధించకుంటుందని చెప్పారు. తనకు కులపిచ్చి ఉందని చంద్రబాబు ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని, కులపిచ్చి అయితే తానెందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని ప్రశ్నించారు.

జగన్‌పై విమర్శకు పార్టీ కార్యకర్తల నుంచే రిటార్ట్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌కల్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో తాము పోటీచేసి కొంత మంది ఎమ్మెల్యేలం గెలిచి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిలా అసెంబ్లీని వదిలి పారిపోయేవాళ్లం కాదని పవన్‌కల్యాణ్‌  అన్నారు. అసెంబ్లీలో నిలదేసే వాడినని అన్నారు. ఆయన మాటలకు ఆ పార్టీ కార్యకర్తలే అడ్డుతగిలారు. పలువురు కార్యకర్తలు ఒక్కసారిగా పెద్దపెట్టుగా ‘ఆయనను అక్కడ మాట్లాడనీయలేదుగా’ అంటూ అరిచారు. దీనికి స్పందించిన పవన్‌కల్యాణ్‌  ‘అయినా మాట్లాడాలి’ అని బదులిచ్చారు. తనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే (కాని పవన్‌ ఎంపీలు అని వ్యాఖ్యానించారు) అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేవాడనన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నారని వ్యాఖ్యానించారు.

బలవంతపు భూసేకరణపై పోరాడండి
సాక్షి, అమరావతిబ్యూరో/మంగళగిరిటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం తన భూదాహాన్ని తగ్గించుకోవాలని.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, వారి కన్నీళ్లను చూడాలనుకుంటే ఎంతటి వారైనా సర్వనాశనమవుతారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకుని కొద్దిమందికే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణను విరమించుకుని ప్రజా మద్దతుతో రాజధానిని నిర్మించాలని ఆయన హితవుపలికారు. అందుకు విరుద్ధంగా అన్నదాతలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే తిరగబడాలని రైతులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పంట పొలాల్లో ఆదివారం ఆయన రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం రైతులతో సమావేశమై వారి బాధలను తెలుసుకున్నారు. 

భూముల్లోకి వెళ్లేందుకు ఆంక్షలు..
రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లోకి వెళ్లేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నారని, సబ్సిడీలను అడ్డుకుంటున్నారని.. బ్యాంకుల్లో రుణాలు కూడా మంజూరు చేయనీయడం లేదని వాపోయారు. 120 రకాల పంటలు పండే ఈ ప్రాంతంలోని సారవంతమైన భూములను మెట్ట భూములు, వర్షాధారిత భూములని ప్రభుత్వం సాకుగా చెప్పడం అన్యాయమన్నారు. రైతుల నుంచి ఇష్టపూర్వకంగా భూములు తీసుకుంటానంటే రాజధాని నిర్మాణానికి తాను మద్దతిచ్చానని.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రైతుల కష్టాలు తెలియని వారు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారని.. మంత్రి నారాయణ దగ్గరుండి పచ్చటి పొలాలను దున్నించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి మరో 25 ఏళ్లు పట్టేలా ఉందని చెప్పారు. 

Advertisement
Advertisement