దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువు | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువు

Published Mon, Jul 9 2018 3:18 AM

Pawan kalyan Open challenge to Minister Lokesh - Sakshi

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి గెలవాలని మంత్రి నారా లోకేశ్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ విసిరారు. గెలుస్తాడన్న నమ్మకం లేకే చంద్రబాబు లోకేశ్‌ని దొడ్డి దారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన నెత్తిన రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పెదరుషికొండ ఐటీ సెజ్‌ ఎస్‌ కన్వెన్షన్‌ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన జనసేన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు నెలకొన్నా పరిష్కారం చూపే దిక్కులేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సామాజిక, రాజకీయ రంగాల్లో సమూల మార్పులు తెస్తామని చెప్పారు.

తనకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేతకావని, మానవత్వంతో కూడిన రాజకీయాల కోసమే జనసేన స్థాపించినట్లు పేర్కొన్నారు. సీట్లు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం రాదన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వస్తే మార్పు వస్తుందని ఆశించి, మద్దతు ఇచ్చి ఓట్లు వేయిస్తే వాళ్లు ప్రజలకు చేసింది సున్నా అని మండిపడ్డారు. 65 ఏళ్ల వయస్సులో కూడా సీఎం చంద్రబాబుకి డబ్బు, పదవి మీద ఆశ చావలేదని విమర్శించారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఏ మూలకు వెళ్లినా సమస్యలేనని, యువతకు ఉద్యోగాల్లేవు, కార్మికులకు ఉపాధి లేదన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఉపాధి కోసం పొట్ట చేతపట్టి దాదాపు 44 వేల మందికిపైగా వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది జూట్‌ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఈ పరిస్థితినే తాను ప్రశ్నిస్తున్నానన్నారు. 

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అవగాహన లేదంటున్నారు...
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తనకు అవగాహన లేదంటున్నారని.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జగన్‌ తమ అనుచరులతో వస్తే.. తానొక్కడినే ఏ పాలసీపైనైనా చర్చించడానికి సిద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీకి భావజాలం లేదని, జనసేనకు అది పుష్కలంగా ఉందన్నారు. జనసేన చెబితేగానీ వాళ్లకు ఉద్దానం సమస్య గుర్తుకు రాలేదని విమర్శించారు. తాను వెళితే కానీ వాళ్లు తుమ్మపాల చెక్కర ఫ్యాక్టరీని పట్టించుకోరన్నారు. కాగా, విశాఖకు చెందిన పలువురు జనసేనలో చేరారు. సురక్ష గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు, బోడేపల్లి శ్రీరామ్మూర్తి, డాక్టర్‌ మౌనితేజ మహారాజ్, చింతల రమణ, డాక్టర్‌ ఐ.ప్రకాష్, బి.జయరాజ్, కోరాడ సర్వేశ్వరావు, రాకేష్‌ మహదేవ్, పసుపులేటి రామారావులకు పవన్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 

Advertisement
Advertisement