కురువృద్ధుడి చర్య.. ఒవైసీ ఆగ్రహం

Owaisi Slams Congress Over Pranab Attended RSS Event - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ కురువృద్ధుడు ప్రణబ్‌ ముఖర్జీ.. ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరుకావటంపై ఒవైసీ స్పందించారు. కాంగ్రెస్‌లో అంతర్గత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ విషయంతో తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు.  శుక్రవారం మక్కా మసీదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... 

‘కాంగ్రెస్‌ పని ఖతమైంది. 50 ఏళ్లు ఆ పార్టీతో అంటకాగిన వ్యక్తి.. ఈ దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన వ్యక్తి... ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారు. అలాంటి పార్టీపై(కాంగ్రెస్‌) ఇంకా ఆశలు పెట్టుకునేవారు ఉంటారా? అంటూ ఒవైసీ అక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘గాంధీ హత్య సమయంలో ఆరెస్సెస్‌ వేడుకలు చేసుకుంది. ఆ విషయాన్ని ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌ తన లేఖల్లో ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడు ఆరెస్సెస్‌ కార్యక్రమంలో ప్రణబ్‌ ఉపన్యసిస్తే.. శభాష్‌ అంటూ కొందరు ప్రశంసలు గుప్పిస్తున్నారు’ అంటూ ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. దేశంలో సెక్యులరిజాన్ని ప్రధాని మోదీ, బీజేపీలు నాశనం చేస్తున్నారంటూ ఒవైసీ మండిపడ్డారు.

కాగా, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి సంఘ శిక్ష వర్గ(ఎస్‌ఎస్‌వీ) మూడో వార్షికోత్సవానికి ప్రణబ్‌ ముఖర్జీ హాజరై ప్రసంగించారు. ‘‘భారతదేశమంటే హిందువులు, సిక్కులు, ముస్లింలు తదితర మతాలు, కులాల, ప్రాంతాలు, భాషల సమాహారం. ఇది మాత్రమే జాతీయవాదం. అంతేగానీ ఒకే దేశం-ఒకే మతం-ఒకే ప్రాంతం అన్న భావనే మనకు వర్తించదు..’’ అని ప్రణబ్‌ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. అయితే ఆయన హాజరు కావటంపై కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కొద్ది గంటలకే వారిలో కొందరు వెనక్కి తగ్గారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top