నోటాకు వచ్చినన్ని కూడా రాలేదు

NOTA Outperforms SP, AAP, NCP as Poll Results Decalred in Five States - Sakshi

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ, సమాజ్‌వాదీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ పార్టీలకు రాలేదు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ మంగళవారం పేర్కొన్న సమాచారం ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో 2.1 శాతం (2,46,918) ఓట్లు నోటాకు రాగా..అక్కడ 85 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి మొత్తంగా 0.9 శాతం (1,04,362) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.2 శాతం ఓట్లు లభించగా, సీపీఐకు 0.3శాతం (38,811)ఓట్లు వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లో నోటాకు మొత్తంగా 1.5 శాతం (5,11,785) ఓట్లు రాగా, ఎస్పీకి 1 శాతం(3,88,485), ఆప్‌కి 0.7 శాతం (2,37,897) ఓట్లు లభించాయి. రాజస్థాన్‌లో నోటాకు 1.3 శాతం (4,64,838) ఓట్లు రాగా సీపీఐ(మార్క్సిస్ట్‌)కు 1.3 శాతం(4,32,666), ఎస్పీలకు 0.2 శాతం (65,160) ఓట్లు లభించాయి. మిజోరాంలో నోటాకు 0.5 శాతం (2,917) ఓట్లు లభించగా, ప్రిజమ్‌కు 0.2 శాతం (1,262) ఓట్లు వచ్చాయి.

నిర్మానుష్యంగా బీజేపీ ఆఫీసు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, మిజోరాం మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ అక్బర్‌ రోడ్‌ లోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top