బండ్ల గణేశా.. ఎక్కడా?

Netizens Setires On Bandla Ganesh Over Telangana Election Results 2018 - Sakshi

సోషల్‌ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్‌పై సోషల్‌మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ముందు నుంచి టీవీ చానెళ్లలో హడావుడి చేస్తూ అందరిదృష్టిని ఆకర్షించిన ఈ యాక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ పొలిటీషియన్‌.. ఇప్పుడు కనబడటం లేదేందని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జనసేన అధినేత, పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్‌ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.

రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న గణేశ్‌.. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నట్లు హల్‌చల్‌ చేశారు. రాజేంద్ర నగర్‌ టికెట్‌ ఆశించిన బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పదవితో సరిపెట్టింది. అయినా అసంతృప్తి చెందని బండ్ల గణేశ్‌.. పార్టీ తరఫున ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనుచరడిగా జోరుగా ప్రచారం నిర్వహించారు. గెలుస్తామనే అతి విశ్వాసమో ఏమో కానీ పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్‌ విసిరారు.

ఫలితాలు కాంగ్రెస్‌ అనుకూలంగా రాకుంటే కత్తులు, బ్లేడ్స్‌ పట్టుకు రావాలని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులకు సూచించారు. తీరా ఫలితాలు.. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండటం.. ప్రజాకూటమి తుడిచిపెట్టుకుపోవడంతో బండ్లను నెట్టింటి పోరగాళ్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఏదైనా.. స్టేటస్‌లు ‘బండ్ల గణేశ్‌ ఎక్కడా?.. కత్తులు సిద్దంగా ఉన్నాయ్‌.. గొంతు కోసుకోవడానికి సిద్దమా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు.  కుళ్లు జోకులతో మీమ్స్‌ను వైరల్‌ చేస్తున్నారు. అంతేకాకుండా బండ్లను ఇంటర్వ్యూ చేసిన సదరు చానెల్ జర్నలిస్ట్‌.. స్వీట్‌ బాక్స్‌ బ్లేడ్‌తో ఆయన ఇంటికి వెళ్లగా.. బండ్ల గణేశ్‌ బయటకు రాకపోవడం గమనార్హం.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top