చేతికి మైక్ దొరికితే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడేది ఇద్దరే ఇద్దరు. ఒకరు రాజేంద్రప్రసాద్, మరొకరు బండ్ల గణేశ్. ఈ మధ్య వీళ్ల మాటతీరు అలాగే ఉంటోంది. తెలియకుండానే లేనిపోని వివాదాలను మీదేసుకుంటున్నారు. ఆ మధ్య రాజేంద్రప్రసాద్.. డేవిడ్ వార్నర్, అలీ, రోజాలపై నోరు జారి తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఈ మధ్యేకంగా మాస్ జాతర మూవీ చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా అని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
విజయ్, అల్లు అరవింద్‌పై సెటైర్లు
ఇక బండ్ల గణేశ్ (Bandla Ganesh).. లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్‌లో కొత్త హీరో మౌళిని మెచ్చుకుంటూనే విజయ్ దేవరకొండపై సెటైర్లు వేశాడు. అల్లు అరవింద్ గురించైతే దారుణంగా మాట్లాడాడు. ఈ సినిమాకి బన్నీ వాసు, వంశీ ఎంతో కష్టపడితే చివరకు అల్లు అరవింద్ సినిమా అంటున్నారు. ఆయన చివరి నిమిషంలో వచ్చి పేరు కొట్టేస్తారు అని కామెంట్స్ చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన కె-ర్యాంప్ సక్సెస్ ఈవెంట్‌లోనూ మరోసారి హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ట్రోల్స్ రావడంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు.
నాకంటూ ఓ స్థాయి ఉంది: అల్లు అరవింద్
ఇక బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ (Allu Aravind)కు ప్రశ్న ఎదురైంది. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. బుధవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ విలేఖరి ఓ ప్రశ్న లేవనెత్తాడు. ఆ మధ్య బండ్ల గణేశ్ మీ గురించి మాట్లాడుతూ.. మీరు చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారన్నారు. ఆ మాటకు మీరు చాలా ఫీలయ్యారని ఇన్‌సైడ్ టాక్.. మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అందుకు అల్లు అరవింద్ సింపుల్‌గా.. నాకంటూ ఓ స్థాయి ఉంది. దాని గురించి మాట్లాడను అని తేల్చి పడేశాడు.


