‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

Natwar Singh Says Non-Gandhi Chief will Cause Congress to Split - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని ప్రియాంక గాంధీ చేపట్టాలని కోరుతున్న సీనియర్‌ నేతల జాబితాలో నట్వర్‌ సింగ్‌ చేరారు. పార్టీని సమర్థవంతంగా నడిపించే సత్తా ఆమెకే ఉందని అభిప్రాయపడ్డారు. గాంధీయేతర కుటుంబం వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు కట్టబడితే 24 గంటల్లోనే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ కుటుంబానికి కాకుండా బయటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ పక్కన పెట్టాలని సూచించారు.

‘ఉత్తరప్రదేశ్‌లోని ఘోరావల్‌ గ్రామంలో కాల్పుల బాధితులను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు ప్రియాంక పట్టుదలను మనమంతా చూశాం. ఆమె అనుకున్నది సాధించుకుని వచ్చారు. ప్రియంక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలా, వద్దా అనేది రాహుల్‌ గాంధీ నిర్ణయంపై ఆధారపడివుంది. ఎందుకంటే తమ కుటుంబానికి చెందనివారే తదుపరి అధ్యక్షుడిగా ఉండాలని రాహుల్‌ అన్నారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. గాంధీ కుటుంబం మాత్రమే కాంగ్రెస్‌ పార్టీని నడిపించగదు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు అధ్యక్షుడు లేకపోవడం దురదృష్టకరం. పార్టీ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబ సభ్యులు తప్పా ఎవరిని ఊహించుకోలేన’ని నట్వర్‌ సింగ్‌ అన్నారు.

ప్రియాంక గాంధీ అయితేనే వందశాతం న్యాయం చేయగలరని మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి అంతకుముందు అభిప్రాయపడ్డారు. ఆమె ఎన్నికకు పార్టీ సీనియర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని, ప్రియాంకకు పోటీగా ఎవరూ ముందుకు రారని తాను బలంగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top