చంద్రబాబుది దగా దీక్ష

MLA Roja fires on CM Chandrababu - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినది దగా దీక్షని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను మాయ చేసేందుకు చేపట్టిన దొంగ దీక్షగా ఆమె అభివర్ణించారు. ఒక్క రోజు దీక్షకు రూ. 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి, తనకు రాజకీయ సమాధి తప్పదనే చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టారని ఆమె విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీ ఎంపీలవలే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, చంద్రబాబు కూడా ఢిల్లీలో దీక్ష చేస్తే జాతీయ స్థాయిలో చర్చ జరిగేదని, కేంద్రంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వచ్చేదని రోజా అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఆశలను సజీవంగా ఉంచింది జగన్‌ మాత్రమేఅని, దీని కోసం ఆయన నాలుగేళ్లుగా ఉద్యమాలు చేశారన్నారు. 

ఆ చానళ్లకు మనసు రాలేదు
రాష్ట్రంలో కొన్ని ప్రసార మాధ్యమాలు పూర్తిగా దిగజారిపోయాయని రోజా మండిపడ్డారు. తమ పార్టీ అధినేత  జగన్‌ ప్రాణాలకు తెగించి తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినపుడు, ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసి, రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఢిల్లీలో దీక్ష చేసినపుడు వాటిని చూపించడానికి ఆ చానళ్లకు మనసురా లేదన్నారు. ఉదయం అల్పాహారం తీసుకుని, రాత్రి భోజనం వేళ వరకూ దీక్ష చేసిన చంద్రబాబుకు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే దానిని చూపేందుకు ఈ చానల్స్‌కు సమయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తనయుడు కొన్ని చానళ్లకు రూ.కోట్లు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్టను దిగజారుస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top