అమాత్యా..! ఏమిటిది!!  | Sakshi
Sakshi News home page

అమాత్యా..! ఏమిటిది!! 

Published Sun, Mar 10 2019 10:22 AM

Minister Families Are The Source Of Constituency Faction Politics - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: ఆ రెండు కుటుంబాలు నియోజకవర్గ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు మూలం. మూడున్నర దశాబ్దాలు పైచేయి సాధించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. ఈక్రమంలో ఎందరోమృత్యువాత పడ్డారు. మరెందరో అవిటివారు అయ్యారు. ఇంకెందరో జైల్లో ఖైదీలుగా మగ్గుతున్నారు. ఈపరిస్థితుల్లో అధికారం, ఆదాయం వారిని ఏకం చేశాయి. కాంట్రాక్టు పనులు, రాజకీయ పదవుల్లో భాగస్వాములు అయ్యారు. ఎన్నికల్లో తలపడడమే తరువాయి కాగా, అనుచరులు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. మీకోసం పనిచేస్తాం. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విజయానికి కృషి చేయలేమని మంత్రి ఆదికి తెగేసి చెబుతున్నారు. 

జమ్మలమడుగు నియోజకవర్గంలో గుండ్లకుంట, దేవగుడి గ్రామాలు కేంద్రంగా ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడిచాయి. ఆ వారసత్వం రెండేళ్ల క్రితం వరకు కొనసాగింది. ఎప్పుడు ‘ఉప్పు–నిప్పు’లా ఉండే ఆ రెండు కుటుంబాలు ఏకమయ్యాయి. తమ వెంటే మీరంతా ఉండాలని, ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేయాలని ఫ్యాక్షన్‌ నడిపిన వారే ఇప్పుడు కోరుతున్నారు. మీరూ–మీరూ ఒక్కటయ్యారా...ఇంతకాలం ఎలా ఫ్యాక్షన్‌ పెంచి పోషించారని ప్రత్యక్షంగా నిగ్గదీయకుండానే అనుచరులు అంతపని చేసేస్తున్నారు. మీ కుటుంబం కోసం పనిచేయమంటే చేస్తాం రామసుబ్బారెడ్డి కోసం పనిచేయమని మంత్రికి తెగేసి చెబుతున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. అచ్చం అలాగే రామసుబ్బారెడ్డి వర్గీయుల కూడా ప్రతిస్పందిస్తున్నారు.

నిన్న పెద్దముడియం... నేడు కొండాపురం... 
శుక్రవారం రాత్రి పెద్దముడియం మండల నేతలతో మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎప్పటిలాగా ఈమారు కూడా ఎన్నికల్లో సహకరించాలని, ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి మనమే గెలిపించుకోవాలని సూచించారు. దానికి అక్కడి వారు వ్యతిరేకించారు. తాము దేవగుడి కుటుంబం కోసం పనిచేస్తాం..కానీ, రామసుబ్బారెడ్డి కోసం పనిచేసేదీ లేదని మంత్రికి స్పష్టం చేసినట్లు సమాచారం. శనివారం కొండాపురం మండల నాయకులతో మంత్రి ఆది సమావేశం ఏర్పాటు చేశారు.

మనమంతా కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేయాలని మంత్రి కోరితే, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జగదేగకరెడ్డి తాము కలిసికట్టుగా పనిచేసేదీ లేదని తేల్చి చెప్పారు. రామసుబ్బారెడ్డి వర్గంతో ఫ్యాక్షన్‌ ఎదుర్కొన్నాం, అనేక ఇబ్బందులు చవిచూశాం, పరస్పర కేసులు నమోదయ్యాయి. వారితో కలిసి పనిచేసేదీ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈపరిస్థితిని మంత్రి ఆది సవరించుకుంటూ వేర్వేరుగా ప్రచారం చేసినా రెండు ఓట్లు వేయించాల్సిన బాధ్యత ఉందని సర్ధిచెప్పారు. పాల్గోన్న వారిలో అనేక మంది ఇలాంటి తీరుతోనే ఉండగా ఒకరిద్దరు మాత్రమే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. కాగా మూడున్నర్ర దశాబ్దాల పాటు వర్గరాజకీయాలను ప్రోత్సహించిన ఫలితమే తాజా ఘటనలకు తాత్కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

నియంతృత్వంపై ధిక్కారం....
ఫ్యాక్షన్‌ రాజకీయాల నేపథ్యంలో దేవగుడి పరిసర గ్రామాలైన సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు, గొరిగేనూరు, దానవులపాడు, సున్నపురాళ్లపల్లి, సలివేందుల,ధర్మాపురం గ్రామాల్లో నియంతృత్వం రాజ్యమేలుతుండేది. ఏ ఎన్నికలు వచ్చినా ఈ గ్రామాల్లో దేవగుడి కుటుంబాన్ని కాదని ఎవరు ఏజెంట్లుగా కూర్చోనే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఆది ఎప్పుడైతే వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి రెండేళ్లు కూడా గడవకముందే, స్వలాభంకోసం టీడీపీ పంచన చేరాడో అప్పటినుంచి తన సొంత గ్రామాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తవవుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీని ఆదరించేందుకు ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమైనా ఆ పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుతగులుతూ వచ్చారు. పట్టువదలని విక్రమార్కుడిలా మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి ఇప్పటి వరకు పెద్దదండ్లూరు, గొరిగేనూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి అపూర్వ ఆదరణ లభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నీడనపెరిగి ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడాన్ని సొంత గ్రామాల ప్రజల సైతం హర్షించడంలేదు. దాంతో ఇంటా బయట మంత్రి ఆది శైలి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. 

Advertisement
Advertisement