పింఛను పథకం ప్రచారాస్త్రమే!

Mega Pension Scheme For Unorganised Sector Workers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ గురువారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో కొత్త పింఛను పథకాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద కార్మికులకు 60 ఏళ్ల నుంచి నెలకు మూడువేల రూపాయల చొప్పున పింఛను లభిస్తుంది. అందుకోసం 29 ఏళ్లు నిండిన కార్మికుడు నెలకు వంద రూపాయల చొప్పున, 18 ఏళ్లు నిండిన కార్మికుడయితే నెలకు 55 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల పది కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని పియూష్‌ గోయల్‌ తెలిపారు.

పింఛను కోసం కనీసంగా ఎంతకాలం పాటు కార్మికుడు తనవంతు భాగాన్ని చెల్లిస్తూ పోవాలనే కాల పరిమితి ఈ పథకంలో ఎక్కడా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఇది కొత్త పథకంగా మోదీ ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ 2015, మార్చిలో ప్రవేశ పెట్టిన ‘అటల్‌ పెన్షన్‌ యోజన’ పథకానికి మరో రూపమని తెలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అటల్‌ పెన్షన్‌ పథకంలో నెలవారి పింఛన్‌ను కనీసంగా వెయ్యి రూపాయలు, గరిష్టంగా ఐదువేల రూపాయలుగా నిర్ణయించారు. పింఛను సొమ్ము ప్రాతిపదికన పింఛను పథకానికి లబ్దిదారుడు నెలవారిగా ఎంత చెల్లిస్తాడో అందులో యాభై శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలా కార్మికుడి పేరిట వెయ్యి రూపాయలు జమయ్యే వరకు ప్రభుత్వం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది.
 
2017, ఫిబ్రవరి నెల నాటికి ఈ అటల్‌ పెన్షన్‌ పథకం కింద లబ్దిదారులుగా నమోదయినది 42.8 లక్షల మంది కార్మికులు మాత్రమే. వీరిలో 48 శాతం మంది కనిష్ట పింఛను వెయ్యి రూపాయలను ఎంపిక చేసుకున్నట్లు ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ తెలియజేసింది. ఈ పథకానికి మోదీ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకంలో అటల్‌ పథకాన్ని విలీనం చేస్తారా ? లేదా రెండింటిని కొనసాగిస్తారా? అన్న విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయలను  కార్మికులు తమ వంతు వాటా చెల్లించే పింఛను పథకాలు యూరప్‌ దేశాల్లో విజయవంతం అయ్యాయిగానీ భారత్‌ లాంటి ఏ వర్ధమాన దేశాల్లో విజయవంతం కాలేదు. అందుకు కారణం దేశంలో కార్మికులకు చాలీ చాలని జీతాలు లభించడమే.

ఎప్పుడో వచ్చే పింఛను కోసం, అసలు అప్పటికి బతికి ఉంటామో, లేదో అన్న సంశయంతో నెలకు వంద రూపాయలను చెల్లించలేని మనస్థత్వం కలిగిన వాళ్లు, ఆర్థిక స్థోమత లేనివాళ్లు భారత కార్మిక రంగంలో ఎక్కువ మంది. నెలకు 15 వేల రూపాయల లోపు జీతం అందుకునే కార్మికులకు మాత్రమే ఈ పింఛను పథకం వర్తించడం ఇక్కడ గమనార్హం. 60 ఏళ్ల వయస్సులో వచ్చే మూడు వేల రూపాయలు నెలవారి పన్ల పొడికి కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పథకం వల్ల పది కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎలా లెక్కలు వేశారో కేంద్రానికే తెలియాలి. అయినా ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకానికి ప్రచారం కావాలిగానీ ప్రయోజనం సంగతి ప్రభుత్వానికి ఎందుకు?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top