సీఎం ఖట్టర్‌.. డిప్యూటీ దుష్యంత్‌

Manohar Lal Khattar, Dushyant Chautala to be sworn in as Haryana CM - Sakshi

హరియాణాలో బీజేపీ, జేజేపీ ఒప్పందం

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం

నేడు ప్రమాణస్వీకారం

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ‘హంగ్‌’ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(65) కొనసాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్‌ చౌతాలా(31) డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీలోని 90 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేకపోయింది. ప్రధాన పార్టీలైన బీజేపీ 40, కాంగ్రెస్‌ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజాతీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై ఆయన..‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది. అయినా, ఈ ఎన్నికల్లో మేం కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయలేదు కదా?’ అని ప్రశ్నించారు.

గవర్నర్‌ను కలిసిన నేతలు
బీజేపీకి చెందిన సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ శనివారం గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరులు సమర్పించిన రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతోపాటు తమకు మెజారిటీ సభ్యుల మద్దతున్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్‌ చేసిన వినతిని కూడా ఆయన అంగీకరించారు. అనంతరం సీఎం ఖట్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరగనుందని ఆయన చెప్పారు. ఖట్టర్‌ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్‌కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అందజేశారు.

గోపాల్‌ కందా మద్దతు తీసుకోం
అంతకుముందు ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకుంది. ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ హాజరయ్యారు. సీఎం పదవికి ఖట్టర్‌ పేరును ఎమ్మెల్యేలు అనిల్‌ విజ్, కన్వర్‌ పాల్‌ ప్రతిపాదించగా మిగతా వారు ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఖట్టర్‌ మంత్రి వర్గంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్‌ కందా మద్దతు తాము తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు.

దుష్యంత్‌ తండ్రి జైలు నుంచి బయటకు
చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్‌ఎల్‌డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్‌ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా  ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్‌ మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా మనవడే దుష్యంత్‌. అధికారంలో ఉండగా ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓం ప్రకాశ్‌తోపాటు ఆయన తనయుడు, దుష్యంత్‌ తండ్రి అయిన అజయ్‌ చౌతాలా ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్‌లలో ఉన్న దుష్యంత్‌ చౌతాలా నివాసాల వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా, ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న దుష్యంత్‌ తండ్రి అజయ్‌ చౌతాలా ఆదివారం నుంచి రెండు వారాలపాటు బయట గడిపేందుకు ఖైదీలకిచ్చే సెలవులాంటి వెసులుబాటు(ఫర్లో)ను అధికారులు కల్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top