
రథయాత్రలో పాల్గొన్న మమత, నుస్రత్
కోల్‌కతా: పరమత సహనంతో మెలగాలని చాటిచెబుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్‌కతాలో ఇస్కాన్ రథయాత్ర ప్రారంభ వేడుకలకు తమ పార్టీలోని ముస్లిం మహిళా ఎంపీ నుస్రత్ జహాన్‌తో కలిసి హాజరయ్యారు. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న నటి, బసిర్హత్ నియోజకవర్గ ఎంపీ నుస్రత్ ఇటీవల పార్లమెంటులో ప్రమాణం సందర్భంగా నుదుటన కుంకుమ, మంగళసూత్రం ధరించి హాజరయ్యారు. దీంతో ముస్లిం మతపెద్దలు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. రథయాత్ర వేడుకలకు నుస్రత్ కుంకుమ, మంగళసూత్రంతో వచ్చారు. పూజలో పాల్గొని సీఎంతో కలిసి రథాన్ని లాగారు. ‘నేను ఇస్లాంను నమ్ముతాను. అలాగే అన్ని మతాలనూ గౌరవిస్తాను. మత పిచ్చితో వ్యాఖ్యలు చేసే వారిని నేను పట్టించుకోను. నా మతం ఏంటో, నేను ఏ దేవుణ్ని నమ్మాలో నాకు తెలుసు. నేను పుట్టుకతోనే ముస్లింని. ఇప్పటికీ ముస్లింనే. మతం అనేది మనిషి లోపల ఉండాలి. తలపై కాదు’ అని అన్నారు.