నిన్న కశ్మీర్‌.. రేపు మన రాష్ట్రాలకు

Mamata Banerjee Fired on Narenda Modi in Tamil Nadu - Sakshi

కేంద్రంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ధ్వజం

ఘనంగా కరుణానిధి తొలి వర్ధంతి

మురసొలి పత్రికా కార్యాలయంలో కరుణ విగ్రహావిష్కరణ

సాక్షి ప్రతినిధి, చెన్నై: జమ్మూకశ్మీర్‌పై రెండురోజుల క్రితం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో సైతం అమలు చేసినా ఆశ్చర్యం లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. చెన్నై రాయపేట వైఎంసీఏ మైదానంలో బుధవారం రాత్రి జరిగిన డీఎంకే మాజీ అధ్యక్షులు కరుణానిధి తొలి వర్ధంతి సభలో ఆమె తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించారు. ఆ తరువాత ఇంగ్లిషులో కొనసాగించారు. కరుణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఏడాది క్రితం చెన్నైకి వచ్చాను. కరుణానిధి తమిళ మాతృమూర్తికి పెద్దకుమారుని వంటి వారు. తమిళ రాజకీయాల్లో అగ్రజుడైన కరుణానిధిని ఎవరూ మరువజాలరు. ముఖ్యమంత్రిగా కరుణానిధి సేవలు రాష్ట్రమంతా మార్మోగుతూనే ఉంటాయి. కరుణానిధి ఇంకా మనమధ్యనే ఉన్నారు, ఆయన ఎప్పుడు చెబుతున్నట్లుగా ప్రజల కోసం మనం పాటుపడుతూనే ఉండాలి. స్టాలిన్‌ అనేది విప్లవాత్మకమైన నామధేయం. పేరుకు తగినట్లుగానే డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మాతృభాష కోసం పోరాటాలకు దిగిన మహామనిషి కరుణానిధి జీవితం ఒక చరిత్ర. తమిళం, బెంగాలీని మనం ఎంతమాత్రం విడిచిపెట్టరాదు. ఎలాంటి పోరాటంలోనైనా విజయాన్ని సాధిద్దాం.

ఈ సభలో పాల్గొనాల్సిన కశ్మీర్‌ రాజకీయ నేతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఇదే పరిస్థితి పశ్చిమబెంగాల్‌కు, తమిళనాడుకు కూడా రావచ్చు. తమిళ ప్రజల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా బీజేపీ నిరంకుశ ధోరణిలో వ్యహరించినా ఆశ్చర్యం లేదు. అయితే అటువంటి పరిస్థితులే ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొందాం. మనం ఏకమై పోరాడి సాధించిన విజయాన్ని ప్రజలకు బహుమతిగా ఇద్దాం. జై పొంగల్, జై తమిళనాడు, జై ద్రావిడం అంటూ ప్రసంగాన్ని ముగించారు.

డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ మాట్లాడుతూ, భారతదేశంలోనే కరుణానిధి వంటి నేత లేరని కొనియాడారు. ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే)ను ఐదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా నడిపించిన ధీశాలి అని అభివర్ణించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కరుణానిధి సేవలు ఈ రాష్ట్రానికి ఇంకా అవసరం ఉందని అన్నారు. సామాజిక న్యాయాన్ని గోతిలో పాతిపెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను హరించేలా బీజేపీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అందుకే పార్లమెంటులో డీఎంకే ఎంపీలు కేంద్రాన్ని వణికిస్తున్నారు, కరుణ ఏమి కోరుకుంటారో అదేవిధంగా వ్యవహరిస్తున్నారని మెచ్చుకున్నారు.

సభలో మాట్లాడుతున్న స్టాలిన్‌
మమత చేతుల మీదుగా కరుణ విగ్రహావిష్కరణ: డీఎంకే మాజీ అధ్యక్షులు దివంగత కరుణానిధి తొలివర్ధంతిని ఆపార్టీ బుధవారం ఘనంగా నిర్వహించింది. డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ నేతృత్వంలో నగరంలో ర్యాలీ, కరుణ విగ్రహావిష్కరణ, బహిరంగసభ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో డీఎంకే నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. బుధవారం ఉదయం స్టాలిన్, లోక్‌సభ సభ్యులు కనిమొళి, దయానిధి మారన్, ఏ రాజా ముందు నడువగా చెన్నై ఆన్నాశాలైలోని అన్నాదురై విగ్రహం నుంచి చెన్నై మెరినాబీచ్‌ లోని కరుణానిధి సమాధి వరకు ర్యాలీగా సాగారు. అనంతరం కరుణ సమాధికి స్టాలిన్‌ నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుగా చెన్నై కోడంబాక్కంలోని మురసొలి పత్రికా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరంపశ్చిమబెంగాల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నారాయణస్వామి సైతం స్టాలిన్‌ వెంటరాగా బుధవారం సాయంత్రం కరుణ సమాధి వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి రాయపేటలోకి వైఎంసీఏ మైదానంలో కరుణ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. డీఎంకే మిత్రపక్ష పార్టీల నేతలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కశ్మీర్‌ వ్యవహారంలో జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా గృహనిర్బంధంలో ఉన్న కారణంగా కరుణ వర్ధంతి సభకు హాజరుకాలేదు.

10న అఖిలపక్ష సమావేశం: జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 10న డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం కానుంది. ఆరోజు ఉదయం 10 గంటలకు చెన్నైలోని అన్నా అరివాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top