
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని అధికార టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం ఇందిరా చౌక్‌లో పోరు దీక్షకు దిగనుంది. స్పీకర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరిట 36 గంటల దీక్ష చేపట్టనున్నారు. అధికార టీఆర్‌ఎస్ ఫిరాయింపు చర్యలను, విలీన ప్రక్రియలో స్పీకర్ వ్యవహరించిన తీరును దీక్షా వేదికగా కాంగ్రెస్ నేతలు ఎండగట్టనున్నారు. ఈ దీక్షలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, పొడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితోపాటు టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఎం, సీపీఐ ముఖ్య నేతలు, ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క, సామాజికవేత్త కంచె ఐలయ్య, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు దీక్షకు సంఘీభావం ప్రకటించనున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... శాసనసభలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేసే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌కు అవసరం లేకున్నా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో విలీన లేఖ ఇప్పించారని భట్టి విక్రమార్క ఆరోపించారు.
దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రండి: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ విలీన ప్రక్రియలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన పదవికి అప్రతిష్ట తెచ్చారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి దిగజారి వ్యవహరించారని దుయ్యబట్టారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా పార్టీ మారారని, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్‌ను కలసి మరో లేఖ ఇచ్చే హక్కు లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా స్పీకర్ ఇంకో వినతి తీసుకోవడానికి వీల్లేదన్నారు.అయినప్పటికీ ఎమ్మెల్యేల నుంచి పోచారం వినతిపత్రం స్వీకరించి మూడు గంటల్లోనే దాన్ని ఆమోదించారని మండిపడ్డారు.
నైతికత గురించి తరచూ మాట్లాడే కేటీఆర్‌లో అంత నైతికత ఉంటే 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోవాలని ఉత్తమ్ సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫిరాయింపులపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఉందని, అది ఈ నెల 11న విచారణకు రానుందని, వచ్చే సోమవారం మరో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఎవరెవరు ఎలాంటి లబ్ధి పొందారో వివరాలు సేకరిస్తున్నామని, దీనిపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతిపక్ష నేతగా దళిత నాయకుడిని కేసీఆర్ చూడలేక పోతున్నారని, ఆయనకు అహంకారం ఎక్కువైందని ఉత్తమ్ మండిపడ్డారు. విలీనానికి నిరసనగా, ఇంది రా చౌక్‌లో నిరాహార దీక్ష చేస్తామని, ధర్నాచౌక్ దగ్గర అనుమతి ఇవ్వకుంటే స్పీకర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షకు కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
నియంతృత్వానికి చిరునామాగా రాష్ట్రం: కుంతియా
తెలంగాణ రాష్ట్రం నియంతృత్వ పాలనకు చిరునామాగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేసిందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక ఉండరాదనే ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పీసీసీ, సీఎల్పీ నేతలు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదన్నారు.
తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి చేర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఇతర పార్టీలో చేరితే ఇబ్బంది లేదని, కానీ రాజీనామాలు చేయకుండా పార్టీలు మారడం ఏమిటని ప్రశ్నించారు. విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా? అని నిలదీశారు. దళిత నాయకుడు సీఎల్పీ నేతగా ఉండటం కేసీఆర్‌కు ఇష్టం లేనట్లుందని విమర్శించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇందిరా చౌక్‌లో నిరాహార దీక్ష చేస్తామని, దీనికి అంతా కలసి రావాలని పిలుపునిచ్చారు.
న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, సీఎం కేసీఆర్‌కు స్పీకర్ పోచారం గులామ్‌లా వ్యవహరించారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. స్పీకర్ నిబంధనలు పాటించకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశారని ధ్వజమెత్తారు. తమకు అందుబాటులోకి రాని స్పీకర్ ఆ 12 మంది ఎమ్మెల్యేలను ఎలా కలిశారు? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోని స్పీకర్... విలీన ప్రక్రియను మాత్రం మూడు గంటల్లోనే ముగించారన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థ ముఖ్యమని, వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని ఆయన సూచించారు. పార్టీ విలీన ప్రక్రియపై న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.