విద్య నిధులు జీతభత్యాలకే! | Sakshi
Sakshi News home page

‘ఉన్నతంగా’ లేవు

Published Fri, Mar 9 2018 9:49 AM

Low Budget Allocated For Education Department - Sakshi

సాక్షి, అమరావతి : బడ్జెట్‌లో విద్యా శాఖకు గతంలో కంటే ఎక్కువగా పెంచినట్లు చూపిస్తున్నా కేటాయింపుల శాతంతో పోలిస్తే ఈసారి గతంలో కంటే తగ్గినట్లు స్పష్టమవుతోంది. గతేడాది కంటే మొత్తం బడ్జెట్‌ పెరిగిన నేపథ్యంలో విద్యా రంగానికి గతంలో కంటే నిధులు పెరగాల్సి ఉన్నా అలా జరగలేదు. విద్యా రంగానికి గతేడాది 14.20 శాతం నిధులు కేటాయించారు. ఈసారి మొత్తం బడ్జెట్‌ 21.07 శాతం పెరిగినా కేటాయింపులు మాత్రం 13 శాతానికే పరిమితమయ్యాయి. సెకండరీ విద్యకు 20 శాతం, ఉన్నత విద్య, సాంకేతిక విద్యలకు కొంతమేర నిధుల కేటాయింపు చేసినట్లు పేర్కొన్నా పెరిగిన మొత్తం బడ్జెట్‌ శాతంతో పోలిస్తే పెరుగుదల ఆ మేరకు లేదు. రాష్ట్రంలో విద్యా రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉంటున్నాయి. 

సరైన వసతులు, బోధన లేనందునే తిరోగమనం
పాఠశాల విద్యకు గతేడాది రూ.17,952 కోట్లు కేటాయించగా, ఈసారి 20 శాతం అదనంగా రూ.21,612 కోట్లను కేటాయించారు. అయితే ఇందులో అత్యధిక శాతం జీతభత్యాలు, ఇతర ఖర్చులకే పోతాయని అభివృద్ధి కార్యక్రమాలకు తగినంత పెరుగుదల లేదని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో 61,710 పాఠశాలలుండగా అందులో 16,688 ప్రైవేటు యాజమాన్యంలోనివి కాగా తక్కినవన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. అన్ని స్కూళ్లలో 72 లక్షల మంది విద్యార్థులుండగా అందులో 65 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. కాగా, ఉపాధ్యాయులు 1.80 లక్షల మంది వరకు ఉన్నారు. అయితే మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక విద్యను అందించడానికి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కావాల్సినన్ని నిధులను కేటాయించడం లేదు.

ఫలితంగా అరకొర ఏర్పాట్లతో పాఠశాల విద్యా ప్రగతి అంతంత మాత్రంగానే ఉంటోంది. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలపై గతంలో నిర్వహించిన సర్వేలో అనేక సమస్యలు బయటపడ్డాయి. పాఠశాలల్లో సరైన బోధన లేనందున గ్రామీణ ప్రాంతాల్లో ఐదో తరగతి చదువుతున్నవారిలో 43.7 శాతం మంది రెండో తరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని చదవలేకపోతున్నారు. 63.8 శాతం మంది సులువైన భాగహారాలను కూడా చేయలేకపోతున్నారు. 54.8 శాతం మందికి చిన్న చిన్న ఆంగ్ల వాక్యాలను చదివే సామర్థ్యం కూడా లేదని ఆసర్‌ నిర్వహించిన గత సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా టీచర్లలో ఆధునిక బోధనానుభవం కొరవడడం, పాఠశాలల్లో ల్యాబ్‌లు, ఇతర పరికరాలు లేకపోవడం వల్లే బోధన కుంటుపడుతోందని తేల్చింది. ఉపాధ్యాయ విద్య సమర్థంగా లేనందున ఉపాధ్యాయ శిక్షణ విధానాన్ని సమూలంగా మార్చాలని అభిప్రాయపడింది. అయితే బడ్జెట్లో వీటికి అతి తక్కువ కేటాయింపులు ఉండడంతో సమస్యల పరిష్కారం కనిపించడం 
లేదు.

ఉన్నత విద్యా రంగానికి తాజా బడ్జెట్‌లో రూ.2,835 కోట్లు కేటాయించారు. అయితే ఈ నిధులు ఆయా విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో సమస్యల పరిష్కారానికి చాలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఉన్నత విద్యా శాఖకు రూ.2,391 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నా.. చివరకు సవరించిన అంచనాల్లో రూ.2095 కోట్లకే పరిమితం చేశారు. ఈసారి ఏకంగా 818 కోట్లకు అంచనా బడ్జెట్‌ను పెంచి చూపిస్తున్నా ఏ మేరకు వాటిని విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే. ఈసారి డిగ్రీ కాలేజీల్లో కొత్త భవనాల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటు, గ్రంథాలయాల్లో పుస్తకాల కోసం నిధులు కేటాయించామని పేర్కొన్నారు. అయితే ఈ పనులకు కేంద్రం నుంచి యూజీసీ ద్వారా, రాష్టీయ్ర ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ కింద నిధులు వస్తాయి. వాటిని కూడా ఇందులోనే కలిపి చూపించినట్లు స్పష్టమవుతోంది. కాగా, ఆదికవి నన్నయ, బీఆర్‌ అంబేద్కర్, రాయలసీమ, ఉర్దూ, యోగి వేమన, విక్రమ సింహపురి యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఈ యూనివర్సిటీల్లో కొన్నిటికి కేపిటల్‌ ఫండ్‌ కింద రూ.380 కోట్లు విడుదల చేస్తున్నట్లు చూపినా విడుదలే చేయలేదు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.20 కోట్లతో హాస్టల్‌ సదుపాయం ఏర్పాటుచేయనున్నట్లు ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ ఏడాది ప్రతిపాదనలన్నీ కేవలం జీతభత్యాలకే ఆయా శాఖల నుంచి అందాయి. కొన్ని అభివృద్ధి పనులకు కేటాయింపులు చేసినా అవి ఎంతవరకు విడుదల అవుతాయో వేచిచూడాల్సిందే.

పోస్టులు ఖాళీ.. సదుపాయాలు నాస్తి
ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినా బడ్జెట్లో ఊసే లేదు. పాఠశాల విద్యాశాఖ 15 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం కోరినా మోక్షం కలగలేదు. ఇందులో 12 వేల పోస్టులు ఇప్పటికే మంజూరైన పోస్టులే అయినా భర్తీకి నోచుకోవడం లేదు. 70 డిప్యూటీ డీఈవో పోస్టులు, 84% ఎంఈవో పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. బోధనేతర సిబ్బంది కూడా అనేక స్కూళ్లలో కరవయ్యారు.  ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ కాలేజీల్లోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సదుపాయాల కల్పన ఘోరంగా ఉంది. మొత్తం హైస్కూళ్లు 6,049 ఉండగా అందులో 146 స్కూళ్లకు విద్యుత్‌ సౌకర్యం, 249 స్కూళ్లకు మంచినీటి సదుపాయం లేదు.  1,612 స్కూళ్లలో బాలురకు, 397 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. 2,374 స్కూళ్లలో సైన్స్‌ లేబొరేటరీలు లేవు. 

Advertisement
Advertisement