ఈవీఎంలు 12.. అభ్యర్థులు 185

Lok Sabha Elections: Candidates Are More Than Evms - Sakshi

సాక్షి, జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాంతంలోని పసుపు రైతులు లోక్‌సభ బరిలో అత్యధిక సంఖ్యలో నిలబడి వారి సమస్యలపై చర్చ జరిగేలా చేశారు. ప్రధాన పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీలతో కలుపుకొని 185 మంది అభ్యర్థులు నిజామాబాద్‌ బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎన్నికలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు ఎన్నికలకు ఎం–3 తరహా ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పా   ట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌హైస్కూల్‌ ప్రాంగణంలో మోడల్‌ పోలింగ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్‌ నిఖిల్‌కుమార్‌ బృందం గురువారం సందర్శించింది.  

దేశంలోనే మొదలు..! 
తమ సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతులు నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్‌ నుంచి ప్రధాన అభ్యర్థులతోపాటు ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. మొదట బ్యాలెట్‌ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తారని.. వాయిదా వేస్తారనే చర్చలు జరిగాయి. ఎన్నికల సంఘం మాత్రం బ్యాలెట్‌ పేపర్‌ కాకుండా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం గతంలో వినియోగించిన ఎం–2 రకం ఈవీఎంలను కాకుండా ఎం–3 తరహా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఒక్క ఈవీఎంకు బదులుగా ఒకే పోలింగ్‌కేంద్రంలో 12 ఈవీఎంల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. 12 ఈవీఎంల్లో 185 అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులతోపాటు చివరన నోటాకు స్థానం కల్పించనున్నారు.   

‘ఎం–3’ ఈవీఎంల వినియోగం 
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఎన్నికలకు ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 785 పోలింగ్‌కేంద్రాలు ఉండగా.. నిజామాబాద్‌ పార్లమెంట్‌లో భాగమైన జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 516 పోలింగ్‌కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో ఒక ఈవీఎంకు బదులుగా 12 ఈవీఎంలను వినియోగించనున్నారు. దీంతో మొత్తం 6,192 ఈవీఎంలు అవసరంకానున్నాయి. ఇందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం ఇప్పటికే సమకూర్చింది. దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఈ తరహా ఈవీఎంలను వినియోగించలేదు.  

టెక్నికల్‌ సిబ్బందితో విధులు 
ప్రత్యేకమైన ఈవీఎంలలో నోటాతో సహా 185 అభ్యర్థుల పేర్లు నిక్షిప్తమై ఉంటాయి. ఓటు వేసిన తర్వాత ఓటరు వేసిన ఓటును చెక్‌ చేసుకునేందుకు వీలుండే వీవీప్యాట్‌ను 12 ఈవీఎంలకు అనుసంధానం చేయనున్నారు. ఓటరు తాము వేసిన ఓటు ఏ అభ్యర్థికి పడిందన్నది 7 సెకన్లపాటు వీవీప్యాట్‌ మిషన్‌లో కనిపించనుంది. ఎం – 3 రకం ఈవీఎంల నిర్వహణకు ఈ ఎన్నికల్లో సుశిక్షితులైన టెక్నికల్‌ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.  

మోడల్‌ పోలింగ్‌కేంద్రం 
12 ఈవీఎంలలో ఎన్నికలు నిర్వహించనుండడంతో ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల అధికారులు జిల్లాకేంద్రంలో మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎం–3 ఈవీఎంలను మూడు టేబుళ్లపై ‘యూ’ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. 12 ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌ మిషన్‌ను టేబుల్‌పై ఏర్పాటు చేయనున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్‌ మిషన్‌తో అనుసంధానం ఉంటుంది. పోలింగ్‌రోజు వరకు మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. పోలింగ్‌ రోజున అన్ని పోలింగ్‌ కేంద్రాల ముందు ఈవీఎంల నమూనా, అభ్యర్థుల జాబితాతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top