రాహుల్‌ ఎందుకిలా..?

Lok Sabha Election Results Demand Introspection In Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో నమో సునామీ దేశాన్ని ముంచెత్తడంతో విపక్ష కూటమికి భంగపాటు ఎదురైంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభంజనంతో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సామర్ధ్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్‌ నాయకత్వంపై ఆ పార్టీలో ఆత్మశోధన జరగని పక్షంలో కాంగ్రెస్‌ పతనాన్ని ఆయనే శాసిస్తాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మోదీ సర్కార్‌ను సాగనంపేందుకు రాహుల్‌ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో హోరెత్తించినా ఏమాత్రం ఫలితం దక్కలేదు.

రాహుల్‌ వ్యూహాత్మక తప్పిదాలే వందేళ్ల పార్టీని పతనావస్ధకు చేర్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. న్యాయ్‌ పథకంతో పేద వర్గాలకు గాలం వేసినా, కాపలాదారే దొంగ అంటూ మోదీ సర్కార్‌పై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడినా ఓట్ల వేటలో మాత్రం రాహుల్ విఫలమయ్యారు. దేశవ్యాప్తంగా కనీసం 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకు పోయింది. యూపీలో 80 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం ఒకే ఒక స్ధానంలో గెలుపొందగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్‌లో సైతం 29 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం ఒక స్ధానంలోనే విజయం సాధించింది.

ఆ రాష్ట్రంలో సంప్రదాయంగా సింధియాల కంచుకోటగా మారిన గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య సింధియాను పరాజయం పలకరించింది. పార్టీ చీఫ్‌ రాహుల్‌ స్వయంగా తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేరళలోని వయనాద్‌లో గెలుపొందడం ఒక్కటే రాహుల్‌కు ఊరట ఇచ్చే పరిణామం.

ఇక​ కాంగ్రెస్‌ కేవలం కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనే ఓ మాదిరిగా కొన్ని స్ధానాలు దక్కించుకోగలిగింది. ఇక తమిళనాడులో తమ భాగస్వామ్య పార్టీ ఏఐఏడీంఎకే గణనీయంగా లోక్‌సభ స్ధానాలు దక్కించుకోగలిగింది. రాహుల్‌ విపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో విఫలమవుతూ వ్యూహాత్మక తప్పిదాలు కొనసాగిస్తే మోదీ కాంగ్రెస్‌ రహిత భారత్‌ నినాదం వాస్తవరూపు దాల్చుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఆప్‌తో పొత్తుకు విముఖత, యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి దూరం కావడం కాంగ్రెస్‌ వైఫల్యాలకు ఓ కారణమని కూడా చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top