మూడో కేసులోనూ లాలూ దోషే

Lalu Prasad Yadav found guilty  by Special CBI court in Ranchi - Sakshi

దాణా కుంభకోణం కేసులో తీర్పునిచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు

ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా

రాంచీ: దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992–93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ ప్రసాద్‌..ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు.

బిహార్‌ మాజీ మంత్రి విద్యాసాగర్‌ నిషద్, బిహార్‌ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్‌ జగదీశ్‌ శర్మ, మాజీ ఎమ్మెల్యేలు ధ్రువ్‌ భగత్, ఆర్కే రాణా, ముగ్గురు మాజీ ఐఏఎస్‌ అధికారులు దోషుల జాబితాలో ఉన్నారు. తీర్పు వెలువడిన అనంతరం లాలూ కొడుకు, బిహార్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ ‘సీబీఐ కోర్టు తీర్పుకు మేం కట్టుబడి ఉంటాం. అయితే ఈ తీర్పే అంతిమం కాదు. హైకోర్టులో అప్పీల్‌ చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని అన్నారు. బిహార్‌ ప్రస్తుత సీఎం నితీశ్‌ కుమార్, బీజేపీ కలసి కుట్రపన్ని తన తండ్రిని ఈ కేసుల్లో ఇరికించాయని తేజస్వీ ఆరోపించారు.

అన్ని శిక్షలూ ఏకకాలంలోనే అమలు
దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం ఐదు కేసులుండగా వాటిలో లాలూకు ఇప్పటికే మూడు కేసుల్లో శిక్ష ఖరారైంది. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. తొలికేసులో తీర్పు 2013లోనే వెలువడగా అప్పట్లో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారు. రెండో కేసులో తీర్పు ఈ ఏడాది జనవరి 6న వచ్చింది. ఈ కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానాను సీబీఐ కోర్టు విధించింది. తొలి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నరేళ్లు, మూడో కేసులోనూ ఐదేళ్లు కలిపి మొత్తం లాలూకు పదమూడున్నరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి కాబట్టి ఆయన ఐదేళ్లు మాత్రమే జైలులో ఉంటే చాలు. మరో రెండు కేసుల్లోనూ లాలూ ఇంకా నిందితుడిగా ఉన్నారు. వాటిలోనూ దోషిగా తేలి శిక్ష పడితే..అన్ని కేసుల్లోకెళ్లా అత్యధిక శిక్షాకాలం ఏది ఉంటుందో అంతకాలం మాత్రం ఆయన జైలులో ఉండాల్సి ఉంటుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top