సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ 

Kuldeep Singh Sengar expelled from BJP - Sakshi

న్యూఢిల్లీ : ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ఈ కేసు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాశంగా మారింది. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా సెంగార్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ సెంగార్‌పై చర్యలకు ఉపక్రమించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించింది.

కొద్ది రోజుల కిందట సెంగార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు తెలిపిన బీజేపీ.. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నది మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్టు తప్పుపట్టిన కొన్ని గంటల్లోనే బీజేపీ సెంగార్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. మరోవైపు బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాగా, సెంగార్‌ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్‌ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్‌ అరెస్ట్‌ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఏడాది గడిచిన కూడా ఈ కేసులో ఎటువంటి చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top