కాళేశ్వరం వ్యయం 80 వేల కోట్లే !

KTR Fires On Rahul Gandhi - Sakshi

లక్ష కోట్లని రాహుల్‌ అబద్ధమాడారు 

ట్వీటర్‌లో మండిపడిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం రూ.లక్ష కోట్లకు పెరిగిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని, ఇది రాహుల్‌కి ప్రసంగం రాసిచ్చిన వారు చేసిన పొరపాటు అని ఆపద్ధర్మ మంత్రి కె.తారకరామారావు తప్పుపట్టారు. రూ.80,190 కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తెలుపుతూ జారీచేసిన లేఖను ట్వీటర్‌లో విడుదల చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.38 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం పేరును ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచిందని శనివారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ చేసిన ఆరోపణలపై కేటీఆర్‌ వరుస ట్వీట్లతో బదులిచ్చారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.17,875 కోట్ల అంచనా వ్యయంతో 2007లో అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి అనుమతించగా, ఆ తర్వాత ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేకుండానే అంచనా వ్యయాన్ని 2008లో రూ.38,500 కోట్లు, 2010లో రూ.40,300 కోట్లకు పెంచారని పేర్కొంటూ కేటీఆర్‌ వాటికి సంబంధించిన మూడు జీవోలను ట్వీటర్‌లో విడుదల చేశారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని 16 టీఎంసీల నుంచి 160 టీఎంసీలకు పెంచడం, అదనంగా మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణంతోపాటు గడిచిన 8 ఏళ్లలో పెరిగిన పునరావాస కార్యక్రమాల వ్యయం కారణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం పెరగదా? అని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఒకే విడతలో రుణ మాఫీ అమలు చేశారని రాహుల్‌గాంధీ మరో అబద్ధమాడారని కేటీఆర్‌ విమర్శించారు. వాస్తవానికి కర్ణాటకలో తొలి విడత రుణమాఫీ నిధులు ఇప్పటివరకు విడుదల కాలేదని తెలిపారు. పంజాబ్‌లో సైతం రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top