కలసి నడుద్దాం

KCR at Jagans swearing in ceremony - Sakshi

పరస్పర సహకారంతో అద్భుత అభివృద్ధి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష

కృష్ణా, గోదావరి జలాలతో రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం కావాలి

ఆ విషయంలో తెలంగాణ రాష్ట్రం సహాయం అందిస్తుంది

చిన్నవయసులో పెద్ద బాధ్యత నిర్వర్తించే సామర్థ్యం జగన్‌కు ఉంది

ఇప్పుడు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు, కరచాలనం

తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్‌ పాలన అందించాలి: స్టాలిన్‌  

‘రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.కృష్ణా జలాలను ఒద్దికగా, పొదుపుగా వినియోగించుకుంటూ సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం చేయాలని కేసీఆర్‌ అభిలషించారు. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా చేపట్టిన పెద్ద బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగే శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నాయని, అది గత తొమ్మిదేళ్లుగా ప్రస్ఫుటంగా నిరూపణైందని కొనియాడారు. సభలో  కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

సాక్షి, అమరావతి/గన్నవరం: ‘నవ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదో ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. వయసుచిన్నదైనా ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను.

మీ కార్యనిర్వహణలో, మీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయవలసింది ఖడ్గ చాలనం కాదు కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. జగన్‌మోహన్‌రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100 శాతం జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాను.కృష్ణా నదీ జలాల విషయంలో  సమస్యలు ఉన్నాయి.

అక్కడ నదిలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా ఒద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కార్యనిర్వహణలో అవసరమైనటువంటి అన్ని విధాల అండదండలు, సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను. అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన పాలన అందించి నాన్నగారి పేరు నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని.. ఒక టెర్మ్‌ కాదు కనీసం మూడు నాలుగు టెర్మ్‌ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తున్నాను.’ అంటూ ముగించారు.  

వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు: స్టాలిన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పరిపాలనలో విజయవంతం కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆకాంక్షించారు. తన తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్‌ మంచి పరిపాలన అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్టాలిన్‌ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడారు.  

ఎయిర్‌పోర్టులో కేసీఆర్, స్టాలిన్‌కు ఘనస్వాగతం
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధినేత స్టాలిన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. తొలుత చెన్నై నుంచి 10.25 గంటలకు స్టాలిన్‌ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమం పూర్తయ్యా సాయంత్రం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరివెళ్లారు.  కేసీఆర్‌ ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పలువురు మంత్రులు విచ్చేశారు. సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ అదే విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top