‘కూటమి’ పరిణామాలపై నజర్‌!

KCR eye on 'Delhi' politics - Sakshi

‘ఢిల్లీ’రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా

రాహుల్‌తో బాబు భేటీపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికలు కేంద్రంగా జాతీ య స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీఆర్‌ఎస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అకస్మాత్తుగా జాతీయ రాజకీయాల పేరుతో ఢిల్లీ వెళ్లినా.. తెలంగాణ ఎన్నికలే ప్రధాన అంశంగా పెట్టుకున్నట్లు టీఆర్‌ఎస్‌ అభిప్రాయపడుతోంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తో చంద్రబాబు భేటీపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఢిల్లీలో గురువారం జరిగిన పరిణామాలపై పలువురు ముఖ్యనేతలతో కేసీఆర్‌ చర్చించారు. కాంగ్రెస్, టీడీపీలు కలవడంపై రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని అడిగి తెలుసుకున్నారు.

విశ్వసనీయత లేని కూటమి ఏర్పాటును ప్రజలు స్వాగతించరని పలువురు నేతలు కేసీఆర్‌తో అన్నట్లు తెలిసింది. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సైతం రాహుల్‌తో శుక్రవారం భేటీ అవుతుండటంతో ప్రజాకూటమి సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉం దని తెలిపారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలు సానుకూలంగా ఉన్నారని.. మహాకూటమి ప్రజల విశ్వాసం పొందే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చినా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కానుంద ని దీనికి అనుగుణంగా ఎన్నికల వ్యూహం సిద్ధం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

ప్రచార వ్యూహంపై..
మహాకూటమి అభ్యర్థులు ఖరారైన తర్వాతే పూర్తి స్థాయి లో ఎన్నికల ప్రచార వ్యూహం అమలు చేయాలని కేసీఆర్‌ భావించారు. మరో వారం తర్వాతే కూటమి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ప్రకటించడంతో దీనికి అనుగుణంగా వ్యూహం అమలు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు పూర్తి చేసి.. దీపావళి తర్వాత నియోజకవర్గాల సభలను ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు.

మహాకూటమి విషయంలో ప్రజల స్పందనకు అనుగుణంగా ప్రచారంలో భాగంగా పూర్తి స్థాయిలో ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించారు. కూటమిలో పొత్తుల కారణంగా సీట్లు కోల్పోయే కాంగ్రెస్, టీడీపీ నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకునే ప్రక్రియపైనా దృష్టి పెట్టాలని నియోజకవర్గాల అభ్యర్థులకు పార్టీ అధిష్టానం సూచించింది. ఏయే సీట్లు ఏ పార్టీకి కేటాయించే విషయంలో ఇప్పటికే సమాచారం అందించింది. కూటమి తుది నిర్ణయానికి అనుగుణంగా ఆయా పార్టీలలను బలహీనం చేసే వ్యూహాన్ని వేగంగా అమలు చేయాలని ఆదేశించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top