మా పథకాలు దేశానికే ఆదర్శం

Kavitha Says That TRS schemes are the motto of the country  - Sakshi

16 సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని చాటుతాం 

దేశం గర్వపడేలా కేసీఆర్‌ పాలన  

బీడీ కార్మికుల పింఛన్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనే.. 

ఎన్నికల ప్రచారంలో ఎంపీ కల్వకుంట్ల కవిత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పేదల సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో తెలంగాణ తొవ్వలోనే దేశమంతా నడిచే ప్రయత్నం ప్రారంభమైందని నిజామాబాద్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్‌ షోలో కవిత మాట్లాడారు. బీజేపీ ఐదేళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఐదేళ్ల పాలనలో దేశమంతా గర్వపడేలా తెలంగాణను నెంబర్‌వన్‌గా తయారు చేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో 16 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని, ఫలితంగా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, యాదవులకు జీవాలు, గంగపుత్రుల కోసం ఉచితంగా చేప పిల్లలు, కేసీఆర్‌ కిట్‌ వంటి సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కవిత వివరించారు. భూమి లేని పేదలు, స్వయం ఉపాధి పొందేందుకు రూ.50 వేల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు.  

ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ 
దేశంలో 13 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే పింఛన్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనేనని, టీఆర్‌ఎస్‌ మన ఇంటి పార్టీ అని కవిత అభివర్ణించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీడీ కార్మిక పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మే నుంచి బీడీ కార్మికులకు రూ.రెండు వేలు పెన్షన్‌ వస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.మూడు వేల భృతి ఇస్తున్నామని, ఇందుకోసం రూ.2,800 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. దళితులు, వృద్ధులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల గురించి జాతీయ పార్టీలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రానికి ముందు కరెంటు సరఫరా ఎలా ఉండేదని, ఇప్పుడెలా ఉందో గమనించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ ఎందుకు సరఫరా చేయడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 12 ఈవీఎంలలో మొదటి ఈవీఎంలో 2వ నెంబర్‌గా తన పేరు, కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరారు. రోడ్‌షోలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటి బెంగను తీర్చబోతున్నాం.. 
సామాన్యుల ఇంటి బెంగను కూడా తీర్చబోతున్నామని కవిత పేర్కొన్నారు. సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.ఐదు లక్షలు, స్థలం లేని వారికి ప్రభుత్వమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. రెండేళ్లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి ఐదేళ్లలోపు పూర్తి చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు గృహాలను వాళ్ల బంధువులకు ఇచ్చుకునే వారని ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top