రైతుల మధ్య చిచ్చు

Kavitha At public Meeting In Nizamabad - Sakshi

కాంగ్రెస్, బీజేపీవి అనవసర ఆరోపణలు 

పసుపు బోర్డు సాధించి తీరుతాం 

స్థలం ఉన్న వారికి ఇంటి కోసం రూ.5 లక్షలిస్తాం

నిజామాబాద్‌ ఎంపీ కవిత వెల్లడి

నిజామాబాద్‌ అర్బన్‌: కాంగ్రెస్, బీజేపీ తోడేళ్లు రైతుల మధ్య చిచ్చుపెడుతున్నాయని నిజామాబాద్‌ ఎంపీ కవిత పేర్కొన్నారు. కొందరు లోక్‌సభ నియోజకవర్గానికి వేల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని చూస్తున్నారన్నారు. ఇది సరైంది కాదన్నారు. నిజామాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రైతుల పార్టీ అన్నారు. రైతుల ముసుగులో కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో జరిగిందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, బీడీ కార్మికులకు పింఛన్లు, నిరుద్యోగులకు రూ.2,800 కోట్లతో భృతి, ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందు నిజామాబాద్‌–పెద్దపల్లి రైల్వేలైన్‌ పడకేసిందని, తాను ఎంపీ అయ్యాక రూ.900 కోట్లతో దాన్ని పూర్తి చేయించానని కవిత పేర్కొన్నారు.  

కొత్త ఒరవడి సృష్టిస్తున్నాం.. 
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని కవిత చెప్పారు. ప్రతి గ్రామంలో పేదవారికి ఆకలి అంటే తెలియకుండా పింఛన్లు అందిస్తున్నామన్నారు. వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామన్నారు. ఏప్రిల్‌ నుంచి 57 ఏళ్ల వయసు వారికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సొంత ఇంటి స్థలం ఉంటే త్వరలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. 

అదనంగా 2 లక్షల ఎకరాలకు నీరు.. 
ఎస్పారెస్పీ పునరుజ్జీవ పథకంతో అదనంగా 2 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చి మొత్తం 5 లక్షల 95 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి చర్యలు తీసు కున్నామన్నారు. 2010 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.104 కోట్లతో వివిధ పంటలు కొనుగోలు చేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014 నుంచి 2018 వరకు రూ.872 కోట్లతో పంటలను కొనుగోలు చేసిందన్నారు. కోరుట్ల, బోధన్‌లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్నా రు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంతో కష్టపడ్డామని, 4 రాష్ట్రాల సీఎం లను ఒప్పించి ఆ పత్రాలను ప్రధానికి ఇచ్చామన్నారు. అయినా కేంద్రం మాత్రం బోర్డు ఏర్పా టు చేయలేదన్నారు. బోర్డు ఏర్పాటు చేసే వరకు ఉద్యమిస్తానని ఎంపీ కవిత వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top