కామాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారా?

kanna Laxminarayana Slams Chandrababu  - Sakshi

గుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ప్రశ్నలు సంధించారు. ఆయన ఇప్పటివరకు 50 ప్రశ్నలు బాబుకి సంధించారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోయినా తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు గుంటూరు కన్నావారి తోట నుంచి లేఖ విడుదలైంది.

11వ విడత కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబుకి సంధించిన ఐదు ప్రశ్నలు

ప్రశ్న నెంబర్‌ 51: భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా?  మొదట టెండర్‌ని దక్కించుకున్న ప్రభుత్వ సంస్థ ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టెండర్‌ని కుంటి సాకులతో రద్దు చేసింది మీ ముడుపుల కోసమేగా అని సూటిగా ప్రశ్నించారు. మళ్లీ టెండరింగ్‌లో పాల్గొనకుండా ఆంక్షలను నిబంధనలను విధించింది కేవలం ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టును ధారాదత్తం చేసి ముడుపులు కమీషన్ల కోసమేనా..దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ప్రశ్న నెంబర్‌ 52: బీద రాష్ట్రమని, కట్టుబట్టలతో బయటికి వచ్చామని కథలు చెబుతూ, ప్రజల ధనాన్ని మీ ఆర్భాటాలకు పప్పు బెల్లాల్లా దుర్వినియోగం చేయడం లేదా? నరసరావుపేట జేఎన్‌టీయూలో రెండు గంటల కార్యక్రమానికి రూ.45 లక్షల ఖర్చా? ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మాస్‌ డెకరేటర్సుకు రూ.35 లక్షలా? బ్రహ్మాండమైన ఆడిటోరియం నాగార్జున యూనివర్సిటీలో ఉంటే, దాన్ని కాదని యూనివర్సిటీకి కూతవేటు దూరంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడమా! ఇంత దుర్మార్గపు దుబారా ఎక్కడైనా ఉందా? ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు ఈ నాలుగేళ్లలో ఎంత చెల్లించారో వెల్లడించగలరా?

ప్రశ్న నెంబర్‌ 53: దేశంలో ఎక్కడా లేనంతగా చదరపు అడుగు 11 వేల రూపాయలు వెచ్చించి , అమరావతిలో సచివాలయాన్ని అసెంబ్లీలను నిర్మిస్తే రెండు రోజుల వర్సాలకే లీకేజీలా? మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శి ఫర్నీచర్‌ వర్షం నీళ్ల లీకేజీకి మునిగిపోలేదా? ఈ నిర్మాణాల అవినీతిపై ఎందుకు విచారణ చేయించలేదు. ముడుపులు ముట్టడం వలనేగా?; ఇంత అవమానకరమైన విషయం మీకు సిగ్గుగా లేదా? రాష్ట్ర పరువు నాశనం కాలేదా? ఈ మొత్తం కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 54 : మీ పరిపాలనలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక దాడులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? స్వర్ణాంధ్రప్రదేశ్‌ను చేస్తానని కామాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారా? వనజాక్షి లాంటి మహిళా అధికారులపై మీ ఎంఎల్‌ఏ దాడి చేసినపుడే మీరు తగినంత చర్యలు తీసుకుని ఉంటే, ఇప్పుడు మహిళా ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఇంత దుర్భర స్థితిలో ఉండేదా? సెలవులు కావాలన్నా, బదిలీ కావాలన్నా, ప్రమోషన్‌ కావాలన్నా లైంగిక వేధింపులు తప్పని పరిస్థితులను మహిళా ఉద్యోగులకు కలగడం మీ పాలనా వైఫల్యం కాదా? ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం మీకు లేదా? ఇంత అసమర్థ ప్రభుత్వం ఒక్క నిమిషమైనా అధికారంలో ఉండే అర్హత ఉందా?

ప్రశ్న నెంబర్‌ 55: రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ఏర్పరచబడ్డ ఎంతో కీలకమైన ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ(ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-రెసిడెంట్‌ తెలుగు సొసైటీ)కి భారత పౌరసత్వం లేని వ్యక్తిని సీఈవోగా నియమించవచ్చా? ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అమెరికా పౌరుడైన వేమూరి రవిని నియమించారు. ఈ సొసైటీలో జరిగే అవకతవకలకు ఒక విదేశీ పౌరుడిని శిక్షించగలరా? ఇప్పటికే అమరావతి, విశాఖపట్నంలలో భూములను సూట్‌కేసు కంపెనీలకు కట్టబెడుతూ ఉంది కదా? ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top