మీ కుటుంబం స్టార్‌ హోటల్‌ ఖర్చు రూ. 30 కోట్లా!

Kanna Lakshminarayana letter to the CM Chandrababu - Sakshi

     మీ దుబారా రాష్ట్ర ప్రభుత్వంపై వేయడానికి సిగ్గుగా లేదా

     వేల కోట్ల ఆస్తి ఉన్న మీరు ఆ ఖర్చు భరించుకోలేరా

     సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో అనేక ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు ఉండి కూడా మీ కుటుంబం ఏడాది పాటు స్టార్‌ హోటల్‌లో ఉండడానికి రూ.30 కోట్ల ప్రభుత్వ డబ్బులను చెల్లించడం ఎంత వరకు సమంజసం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘రాష్ట్రం అష్టకష్టాల్లో ఉందంటారు. మీ దుబారా అంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రుద్దటానికి సిగ్గు వేయడం లేదా. వేల కోట్ల ఆస్తులున్న మీరు కష్టాలలో ఉన్న రాష్ట్రం కోసం మీ ఖర్చులు మీరే చెల్లించుకోలేరా’ అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి ప్రజల సొమ్ము ఇలా దుర్వినియోగం చేయవచ్చా అని ప్రశ్నించారు.

విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్ర బ్రహ్మాండమైన ప్రగతిని సాధించామని కోతలు కోసే మీరు.. ఈ నాలుగేళ్లలో అదనపు విద్యుత్‌ కోనగోళ్లకు ప్రభుత్వం చేసిన ఖర్చుపై సీబీఐ విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కోలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచకుండా, ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోళ్లపై ఎందుకు ఆసక్తి చూపారో ప్రజలకు వివరించగలరా అని ప్రశ్నించారు. లోకేష్‌ కనుసన్నలలో ఈ కుంభకోణం జరిగిన మాట వాస్తవం కాదా అని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు. నాలుగేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.40 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెబుతున్నారని.. అందులో సగం డబ్బులను కమీషన్ల రూపంలో మీరూ (చంద్రబాబు), మీ జలవనరుల శాఖ మంత్రి కొట్టేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతులలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి, వారితో ఒట్లు వేయించుకొని, అధికారంలో వచ్చాక హామీని అమలు చేయకుండా వారిని మోసం చేశారని దుయ్యబట్టారు.

మీరు నిప్పే అయితే కేసులపై స్టేలు ఎందుకు?
తెల్లవారి లేస్తే నిప్పునని చెప్పుకునే మీకు మీ మీద ఉన్న కేసులన్నిటిలో స్టేలు తెచ్చుకోవడంపై సమాధానం చెప్పే ధైర్యం గానీ, అన్ని కోర్టు స్టేలు ఎలా వచ్చాయో చెప్పే దుమ్ము లేదని ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలని సొంత మనుషులను నింపి, వారి ద్వారా ఆ వ్యవస్థలను అనైతికంగా ప్రభావితం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఏ తప్పు చేయని వారైతే మీపై ఉన్న స్టేలు వేకేట్‌ కావాలి కదా అని ప్రశ్నించారు. పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న మీరు సుపరిపాలన ఎలా అందించగలరని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top