అఖిలప్రియపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

Kanna Lakshminarayana Complaint Againt Bhuma Akhila Priya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ మంత్రి భూమా అఖిలప్రియను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. ఏపీ బీజేపీ నేతలతో వెళ్లి గవర్నర్‌ను గురువారం కలుసుకున్న ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దుర్మార్గాలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం దారుణమన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోలేక ఎన్డీఏ నుంచి చంద్రబాబు వైదొలిగారని ఆయన అభిప్రాయపడ్డారు. 

2019 ఎన్నికల్లో గెలవదని భావించే టీడీపీ నేతలు, మంత్రులు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ డబ్బుతో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం చంద్రబాబు నాయుడు ఎదుట సంస్కార హీనులుగా, హీనమైన భాషను ప్రధాని మీద వాడటం మంచిది కాదని హితవు పలికారు. ప్రధానిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అఖిలప్రియను సైతం బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు మాట్లాడిన భాష హుందాగా లేదని, ఆయన చదువుకున్న మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారంటూ కన్నా మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. పోలీస్‌ అధికారులు టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని.. అదే విధంగా పోలీస్‌ స్టేషన్లు టీడీపీ నేతలకు కార్యాలయాలుగా మారిపోయాయని తీవ్ర వ్యాఖ‍్యలు చేశారు. సీఎం చంద్రబాబు ప్లాన్‌లో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తిరుమలకు వస్తే రాక్షసంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని టీడీపీ నేతలకు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు.

   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top