దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి

jupalli krishna rao started devolopment works - Sakshi

పాలమూర్‌–రంగారెడ్డి ప్రాజెక్టుతో సాగునీటి సమస్య పరిష్కారం

కోస్గి మండలంలో మంత్రులు జూపల్లి, పట్నం పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హాజరైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి  

మహబూబ్‌నగర్‌ , కోస్గి: పోరాడి సాధించుకున్న తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేస్తూ దేశం గర్వించేలా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలో చంద్రవంచ, ముక్తిపాడ్, బొలుగోనిపల్లి, పోతిరెడ్డిపల్లి, కోస్గి, కడంపల్లి, మాసాయపల్లి, అమ్లికుంట్ల, మల్‌రెడ్డిపల్లి, సంపల్లి గ్రామాల్లో వారు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కోస్గి, సంపల్లిలో జరిగిన సభల్లో మంత్రులు మాట్లాడారు. కాగా, కార్యక్రమాల్లో కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా పాల్గొని కోస్గిలో జరిగిన సభలో మాట్లాడారు. ఆ తర్వాత చివరగా సంపల్లిలో జరిగిన సభలో మాత్రం ఆయన పాల్గొనకుండా వెళ్లిపోయారు. 

అభివృద్ధిని అడ్డుకోవద్దు..
కోస్గి, సంపల్లిలో జరిగిన సభల్లో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిపుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ హుందాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాల కోసం అభివృద్దిని అడ్డుకుంటే పుట్టగతులుండవన్నారు. పాలమూర్‌–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. పాలమూర్‌ జిల్లాకు రోడ్ల కోసం గత పాలకులు రూ.2 కోట్లు అందించని దుస్థితి ఉంటే ప్రస్తుతం కేవలం పాలమూర్‌ జిల్లాకే రూ.140 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఒక్క కొడంగల్‌ నియోజకవర్గం కోసం రూ.50 కోట్లు ఇచ్చామన్నారు. మరో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అడుగడుడున అభివృద్ధిని అడ్డుకుంటూ తన రాజకీయ ఉనికి కోసం పాకులాడే రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమేనని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నారని ఇందులో భాగంగనే కొడంగల్‌ అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు.

కోస్గి బస్‌ డిపోకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఆంధ్ర పార్టీలో ఉండి తెలంగాణ రాకుండా అడ్డుకున్న దద్దమ్మలు నేడు రాజకీయ మనుగడ కోసం పార్టీ మారి అభివృద్దిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌లో చేరి ఏం చేస్తారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాజకీయాల కోసం ప్రజల్ని మభ్యపెట్టి మాయమాటలతో కాలం గడిపాయని, కేసీఆర్‌ది మాటలు చెప్పేతత్వం కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ  రేవంత్‌రెడ్డి ఏనాడు అభివృద్ది కోసం పని చేయలేదని తన జీవితమంతా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు, దందాలకే పరిమితమైందని విమర్శించారు. ఇటు తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండకుండా తన సొంత దందాల కోసం తిరుగుతున్న రేవంత్‌రెడ్డి అభివృద్ధి్దని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.  

అభివృద్ధి్దకి నిరంతరం కృషి
రెండుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్‌ ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కోస్గికి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేయించానని, గేల్‌ సంస్థ సహాకారంతో జూనియర్‌ కళాశాలను నిర్మించానన్నారు. బస్‌డిపో ఏర్పాటు కోసం సొంతంగా భూమి కొనుగోలు చేసి తన ఎమ్మెల్యే నిధుల్ని కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అన్న కిష్టప్ప, వైస్‌ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనితబాల్‌రాజ్,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

పోటాపోటీగా ర్యాలీలు
మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలు పోటాపోటీ ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. ఈ మేరకు పోలీసులు వలయంగా ఏర్పడి ఇరువర్గాలను వేరు చేయడంతోపాటు శంకుస్థాపనకు ముఖ్యులనే అనుమతించారు. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే వాహన శ్రేణి ఓ వైపు, మంత్రుల కాన్వాయ్‌ ఓ వైపు వెళ్తుండడంతో పోలీసులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. బొల్వోన్‌పల్లి దగ్గర ఎమ్మెల్యే వెంట మమ్మల్ని ఎందుకు అనుమతించడంలేదంటూ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్, నాయకులు అంజయ్య, రహీం, ఇద్రీస్, నరేందర్‌ తదితరులు సీఐ రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top