రెండు చోట్ల ఓటమి పాలైన పవన్‌ కల్యాణ్‌

Janasena Pawan Kalyan Lost In Two Seats - Sakshi

సాక్షి, అమరావతి : తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్‌.. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవడంతో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భీమవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలో మూడో స్థానానికి పరిమితమై ఘోర పరాజయం పాలయ్యారు. అయితే రాజకీయ అనుభవం లేకపోవడం, ప్రచార సరళిలో ఆయన వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా గత ఎన్నికల్లో చంద్రబాబు తరఫున ప్రచారం నిర్వహించిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌- టీడీపీల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పాలనలో వైఫల్యం చెందిన ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించడానికే పవన్‌ ఎక్కువ సమయం కేటాయించడం.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఏదో నామమాత్రంగా నాలుగు మాటలు మాట్లాడేసి వైఎస్సార్‌ సీపీని ఆడిపోసుకోవడానికే ఆయన ప్రాధాన్యం ఇవ్వడం.. అంతేకాక టీడీపీకి లాభం చేకూర్చే విధంగా ఒక అండర్‌స్టాండింగ్‌ ప్రకారం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పవన్‌ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు’ అని ఆయన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా లోపాయికారి ఒప్పందం ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి తొలి ఎన్నికల్లోనే ఘోర పరాభవం చవిచూశారని పేర్కొంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top