‘పచ్చ’దళంలో స్థూపం చిచ్చు

Janasena Colour Paint On TDP Memorials East Godavari - Sakshi

జెంటిల్మన్‌ ఒప్పందానుసారం చైర్మన్‌ కానున్న నాగసతీష్‌

నెలరోజుల వ్యవధిలో ఆయన వార్డులో 2 టీడీపీ స్థూపాలకు జనసేన రంగులతో ముస్తాబు

స్థూపం రంగు మార్చకపోతే రాజీనామాను ఉపసంహరించుకుంటానన్న చైర్మన్‌ గణేష్‌

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌:  పట్టణంలో టీడీపీ స్థూపాలకు జనసేన రంగు పులిమిన విషయమై పార్టీ శ్రేణుల్లో మళ్లీ వివాదం  రాజుకుంది. మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో టీడీపీ రంగుతో..‘జై మెట్ల’ అని రాసి ఉన్న స్థూపానికి  నెల రోజుల కిందట రంగులు మార్చి ‘జై యాళ్ల’ అని రాసినప్పుడు ఈ వివాదానికి నాంది పడింది. మళ్లీ ఇప్పుడు టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు అదే వార్డులో తమ పార్టీ స్థూపానికి రంగు మార్చేసి జనసేన రంగు, గుర్తుతో ముస్తాబు చేయడంతో వివాదం మరింత  ముదిరింది. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి గతంలో జరగిన జెంటిల్మన్‌ ఒప్పందం అమలు కానున్న సమయంలో టీడీపీ స్థూపాల రంగులు, గుర్తులు మార్చడంపై ప్రస్తుత చైర్మన్‌ చిక్కాల గణేష్, జెంటిల్మెన్‌ ఒప్పందం ప్రకారం కాబోయే చైర్మన్‌ అభ్యర్థి, నాలుగో వార్డు కౌన్సిలర్‌ యాళ్ల నాగ సతీష్‌ మధ్య వివాదం మరింత ముదిరింది.

ఇప్పటికే గణేష్‌ పదవికి చేసిన రాజీనామాను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించేందుకు సన్నద్ధమయ్యారు. చైర్మన్‌ అభ్యర్థి నాగసతీష్‌ వార్డులో నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు టీడీపీ స్థూపాలకు రంగులు మార్చేసిన వివాదాన్ని గణేష్‌ అనువుగా మలచుకోజూస్తున్నారు. తాను చైర్మన్‌గా తప్పుకుంటున్నానని, తన వార్డులో ఎవరూ జనసేన వైపు వెళ్లడం లేదని చెప్పుకుంటూ ఒప్పందం ప్రకారం చైర్మన్‌ చేపట్టనున్న నాగ సతీష్‌ సొంత వార్డులో ఇప్పటికే రెండు సార్లు  టీడీపీ స్థూపాలపై రంగులు, పేర్లు మారినప్పుడు  ఏం చర్యలు తీసుకున్నారని పార్టీ పెద్దలను నిలదీశారు. స్థూపం రంగుల మార్పు విషయాన్ని సోమవారం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ మెట్ల రమణబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీల ముందు పెట్టారు.     మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలలోపు  స్థూపంపై టీడీపీ రంగులు, గుర్తు తిరిగి వేయకపోతే చైర్మన్‌ పదవికి తానిచ్చిన రాజీనామాను ఉపసంహరించుకుంటానని హెచ్చరించారు.

తక్షణం టీడీపీ స్థూపంగా మార్చండి
గణేష్‌ హెచ్చరిక నేపథ్యంలో ఎమ్మెల్యే, పట్టణ పార్టీ పెద్దలు నాగ సతీష్‌ను పిలిపించి స్థూపం విషయంలో జరిగిన దానికి వార్డు కౌన్సిలర్‌గా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే  టీడీపీ స్థూపంగా మార్చాలని సూచించారు. కాగా టీడీపీ స్థూపాన్ని జనసేన స్థూపంగా మార్చిన స్థలం  నాలుగో వార్డు పరిధిలోకి రాదని, ఎనిమిదో వార్డు పరిధిలోకి వస్తుందని నాగ సతీష్‌ విలేకరులకు చెప్పారు. ఇదే విషయమై పట్టణ టీడీపీ అధ్యక్షుడు నేతాజీ మాట్లాడుతూ ఆ స్థూపం వద్ద గత మూడు దశాబ్దాలుగా  నాలుగో వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలే  కార్యకలాపాలు నిర్వహిస్తారని, అది నాలుగో వార్డేనని చెప్పడం విశేషం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top