సంక్షేమమా?.. సంక్షోభమా?

Harish Rao fires on Comments on Mahakutami - Sakshi

ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి: హరీశ్‌రావు  

సీట్లు పంచుకోలేనోళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారా?  

కొడంగల్‌ అభివృద్ధి పట్టని రేవంత్‌.. నర్సాపూర్‌ను దత్తత తీసుకుంటాడా? 

సాక్షి, మెదక్‌: సీట్లు పంచుకోలేని వారు.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. టికెట్ల కోసం కూటమి నేతలు జుట్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డి శనివారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో హరీశ్‌రావు మాట్లాడారు. సంక్షేమం కావాలో.. సంక్షోభం కావాలో ప్రజలు తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్థిక, రాజకీయ, కరెంటు సంక్షోభాలు రావటం ఖాయమన్నారు. పదవుల కోసం కొట్లాటలే తప్ప ప్రజల గురించి ఆలోచించే నాథుడే ఉండర న్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తదితరులను సీఎం కుర్చీ నుంచి దించేందుకు సొంత పార్టీ నేతలే రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సీఎంలను కుర్చీ ఎక్కించుడు.. దించుడు తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. కొడంగల్‌ నియోజకవర్గం వెనుకబాటుకు అక్కడి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కారణమని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్‌ను అభి వృద్ధి చేయలేని ఆయన.. నర్సాపూర్‌ను దత్తత తీసుకుంటానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే.. 
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ ఎలా పొత్తు పెట్టుకుంటుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. టీడీపీ పొత్తు అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లేనని చెప్పారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని విమర్శించారు. వారు డబ్బు, మద్యం నమ్ముకోగా.. టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని నమ్ముకుని ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు కన్నీళ్లు తప్పవని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే చెబుతున్నారని వీటన్నింటిని ప్రజలు గమనించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరం సాగటంతోపాటు ప్రాజెక్టులు పూర్తయి పొలాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందుతుందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ నర్సాపూర్‌ను విస్మరిస్తే తాము నాలుగేళ్లలో అభివృద్ధి చేశామని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని చెప్పారు.  

ప్రత్యర్థికి డిపాజిట్‌ వస్తుందా...
గజ్వేల్‌: కాంగ్రెస్‌ పాపాలు ప్రజలకు గుర్తుకొస్తాయనే భయంతోనే.. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారానికి తీసుకెళ్లడం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో మర్కూక్‌ మండలానికి చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఫర్టిలైజర్స్, డీలర్స్‌తో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్‌ భారీ మెజార్టీతో గెలవడాన్ని ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు. ప్రత్యర్థికి డిపాజిట్‌ వస్తుందా... లేదా అనే అంశం మాత్రమే తేలాల్సి ఉందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top