పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు! 

Governors of Five states meet Amit Shah    - Sakshi

 సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత ప్రస్తుతం వివిధ రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు సాగుతున్నాయి. పరిపాలన, రాజకీయ పరమైన కారణాల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. చాలామంది గవర్నర్లు మోదీ మొదటిసారిగా ప్రధాని అయిన 2014లో నియమితులైనవారు కావడంతో తాజా పరిస్థితిని కేంద్ర హోం శాఖ సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు గవర్నర్లు చాలాకాలంగా కొనసాగుతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జిలుగా ఉన్నారు.

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా అలాగే తెలంగాణ గవర్నర్‌గా పదేళ్లుగా కొనసాగుతున్నారు. కాగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న అనిల్‌ బైజాల్‌ ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్లను ఎప్పుడు మార్చేదీ, ఎందరిని మార్చేదీ తెలియరాలేదు. సోమవారం నాటి పరిణామాల తర్వాత ప్రభుత్వం ఈ వ్యవహారం గోప్యంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు అయిదు రాష్ట్రాల గవర్నర్లు...కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరీ నాథ్‌ త్రిపాఠీ, తమిళనాడు గవర్నర్‌ భన్వర్‌లాల్‌ పురోహిత్‌, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, అరుణాచల్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా తదితరులు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top