పొలిటి'కలే?' 

Economic survey reveals about Womens participation in Politics - Sakshi

మహిళలకు దక్కని రాజకీయ స్వేచ్ఛ, సమానత్వం 

ఇప్పటికీ 15 శాతం మించని మహిళల భాగస్వామ్యం 

ఎకనామిక్‌ సర్వేలో వెల్లడి 

‘మహిళలకు ఓటు హక్కే కాదు..ఎన్నికల్లో నిలబడే హక్కు ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం’ అంటారు చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్‌ బచెలెత్‌. మన దగ్గర స్త్రీలకు ఆ హక్కు ఉంది.. వినియోగించుకుని ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులూ అయినవారున్నారు.. అవుతున్నారు కూడా.  అయితే, హక్కు ఉంటే సరిపోదు..ఆ వాతావరణం..స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఉండాలి. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటే మహిళలు గడపదాట గలిగే వెసులుబాటు ఒక్కటే కాదు. ఇంటి బాధ్యతల నుంచి కూడా వెసులుబాటు. ఫలానా పనులు ఆడవాళ్లు మాత్రమే చేయాలి అన్న నియమనిబంధనల నుంచి వెసులుబాటు. కొన్ని సాంఘిక కట్టుబాట్ల నుంచి కూడా వెసులుబాటు చాలా అవసరం. మహిళలకు పాలనలో సమభాగస్వామ్యం కావాలంటే మిగిలిన బాధ్యతల నుంచి వెసులుబాట్లు తప్పనిసరి. దీన్ని ఇటీవలి ఎకనామిక్‌ సర్వే కూడా వెల్లడించింది.  

మరో కోణం 
రాజకీయాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరగకపోవడానికి  మరో కోణం కూడా  కనిపిస్తుంది. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అబ్బాయిలు నచ్చిన పార్టీలో చేరి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలకు ఆ అవకాశం ఉండట్లేదు.  చదువు తర్వాత ఉద్యోగం.. లేదంటే వెంటనే పెళ్లి తప్పనిసరి. కాదనుకొని వెళ్లినా రక్షణ సమస్యగా మారుతుంది. ఇప్పటికీ మన దేశంలో పాలిటిక్స్‌ అంటే మహిళలకు రిస్క్‌ అనే భావనే. మరి ఇప్పుడు ఉన్న మహిళా నేతలు వచ్చినా.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వాళ్లు చాలా తక్కువే. 
- తండ్రికి వారసురాలిగానో.. భర్తకు ప్రతినిధిగానో.. కుటుంబ రాజకీయ, వ్యాపార లావాదేవీలకు టూల్‌గానో మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం మినహా.. ఆసక్తితో, లక్ష్యంతో, ప్రజాసంక్షేమ కాంక్షతో, విధాన నిర్ణయాల్లో భాగస్వామి కావాలనే తపనతో, పూర్తి అవగాహనతో వచ్చిన వాళ్లు చాలా తక్కువ.   
మహిళలు రాజకీయాల్లో కీలకంగా ఉండుంటే.. ఈ రోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్‌ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితే ఉండకపోయేది. 

మారిన ఎన్నికల చిత్రం 
రాజకీయాల్లోకి రావాలంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి. ప్రజాజీవితంతో మమైకమైన జీవనశైలిని పాటిస్తుండాలి. ప్రశ్నించే తత్వం కావాలి. ఇప్పుడు వీటన్నిటికన్నా.. డబ్బు ముఖ్యం. మనీతో పవర్‌.. పవర్‌తో మనీ.. రొటేట్‌ అవుతున్నాయి. కుటుంబ వారసత్వంతో వచ్చిన వారికి ఆర్థిక, నైతిక మద్దతుతోపాటు అంగబలమూ ఉంటోంది. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండిపెండెంట్‌గా రావాలనుకునే వారికే అన్ని ఇబ్బందులు. ప్రధాన పార్టీలూ అంత తర్వగా వీరిని ఆహ్వానించట్లేదు. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. 

ఏం చెప్పింది? 
2017–18  సంవత్సరానికి నిర్వహించిన ఈ సర్వేలో 49 శాతం మహిళా జనాభా ఉన్న మన దేశంలో వాళ్ల రాజకీయ భాగస్వామ్యం కేవలం 15 శాతమేనని తేలింది. రువాండా లాంటి దేశంలో పార్లమెంట్‌లో 60 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంటే మనం 15 శాతంతో ఈజిప్ట్, బ్రెజిల్, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌  వంటి దేశాల సరసన ఉన్నాం.  
ఇంటర్‌– పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ), యూఎన్‌ విమెన్‌ విభాగం ఇచ్చిన  ‘విమెన్‌ ఇన్‌ పాలిటిక్స్‌ –2017’ అనే నివేదికను కూడా ఈ సర్వే ప్రస్తావించింది.  
ఆ నివేదిక ప్రకారం 2016, అక్టోబర్‌ నాటికి దేశంలో ఉన్న 4, 118 మంది ఎమ్మేల్యేలలో మహిళల శాతం కేవలం తొమ్మిది.   
2010 నుంచి 2017 వరకు అంటే ఏడేళ్లలో చట్టసభల్లో (లోక్‌సభ)పెరిగి మహిళా భాగస్వామ్యం ఒక్క శాతమే.   
ఇంటి బాధ్యతలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ భారం, కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్లే  మహిళలు రాజకీయాల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారని సర్వే తేల్చింది. 

ఎంత మందికి అధికారం? 
ఇప్పుడు ఎన్నికైన వాళ్లకెంతమందికి అధికారం ఇచ్చారని మనం పార్టిసిపేషన్‌ గురించి మాట్లాడుకోవాలి? తెలంగాణ ప్రభుత్వంలో ఎంత మంది మహిళలకు పదువులున్నాయి? మహిళా కమిషన్‌ కూడా లేదు. వెల్‌ ఎడ్యూకేటెడ్, అవేర్‌నెస్, ఉత్సాహం ఉన్న సూరేపల్లి సూజాత లాంటి వాళ్లకు ఏ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి? అసలు పొలిటికల్‌ పార్టీస్‌కే మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదు. ఇలా అయితే విమెన్‌ పొలిటికల్‌ పార్టిసిపేషన్‌ ఎలా పెరుగుతుంది.? 
– రమా మేల్కొటే, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకురాలు 

కార్యకర్తలే అడ్డు చెప్తరు..
ఎలక్షన్లలో నిలబడ్డానికి ఆడవాళ్లు ఉత్సాహంగానే ఉన్నరు. అయితే టికెట్లిచ్చే దగ్గర పార్టీ పెద్దలు ఎంత పక్షపాతంగా ఉన్నరో, కార్యకర్తలూ అంతే ఉన్నరు. మగవాళ్లకే సీట్లివ్వాలని ఒత్తిడి చేస్తరు. వాళ్లను గెలిపించేందుకే కష్టపడ్తరు. ఎందుకంటే మగవాళ్లు వస్తే వాళ్లు తింటరు, వీళ్లకు తినిపిస్తరు అని. అదే ఆడవాళ్లయితే అంత అవినీతికి పాల్పడరు కదా. అందుకే కార్యకర్తలకు ఫాయిదా ఉండదు. అందుకే మహిళలకు సపోర్ట్‌ చేయరు. అయినా మహిళలు నిలబడాలే.  
– సి. బాలేశ్వరి,గృహిణి, హైదరాబాద్‌ 

వేరుగా ఓ పార్టీ పెట్టి.. 
రాజకీయ చైతన్యం మహిళ్లో పెరిగింది. కానీ.. భాగస్వామ్యం తగ్గింది. దీనికి మార్కెట్‌ సంస్కృతి ఒక కారణం. డబ్బు, పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోవడం వల్ల ధైర్యంగా ముందుకొస్తున్నవాళ్లు మహిళల సంఖ్య తక్కువే. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందిన వారు సైతం ఇతరుల మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? మహిళలమే సపరేట్‌గా ఓ  పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేయట్లేదు. పార్టిసిపేషన్‌ పెరగాలంటే ఇవన్నీ అవసరమే. అన్నిరకాలుగా ప్రెషరైజ్‌ చేయాలి.  
– డాక్టర్‌ సమున్నత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఓయూ   

ప్రయోజనాలెన్నో.... 
మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల సమాజ ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది. సున్నితత్వం పెరుగుతుంది.  
అవినీతి, దుబారాలకు తావుండదు. నేరాల, ఘోరాల నియంత్రణ జరుగుతుంది.  
దేశానికి స్త్రీ కోణం అవసరం. ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీ తనం, ఖర్చులకు ఒక లెక్కా, పత్రం, మౌలిక సదుపాయల వసతి, అందరికీ ఉపాధి.. ఇవన్నీ అవలీలగా నిర్వహించగల సమర్థురాలు స్త్రీయే. 
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా మనం ఇంకా మౌలికసదుపాయాలు, అందరికీ ఉపాధి దగ్గరే ఆగిపోయాం. దీనికి కారణం.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగకపోవడమే.  
భవిష్యత్‌కి ఘనమైన చరిత్ర ప్రేరణ కావాలంటే వర్తమానం ఆరోగ్యంగా  ఉండాలి. ఆలోచన ఉన్న స్త్రీలకు అవకాశం కావాలి. ఇప్పుడు చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రశ్నించాలి. తమ సంఖ్య పెంచుకునేలా ప్రయత్నించాలి. రాజకీయాల్లోనూ మన ఉనికి చాటడానికి మరో ఉద్యమానికి ఊపిరి పోసైనా సాధించుకోవాలి.  

ధాయ్‌.. ది లవ్‌ డాక్టర్‌ 
శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ గుర్తుందా? రోగులకు వైద్యం కన్నా ప్రేమపూర్వకమైన మాటలు అవసరమంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి ఓ వైద్యుడు మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీలో నిలిచి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ధాయ్‌ అక్సర్‌ అనే డాక్టర్‌.. ప్రజాస్వామ్యాన్ని ప్రేమపూర్వకంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. జబల్‌పూర్‌(ఉత్తరం) నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రేమతంత్రమంటే అందరినీ ఏకం చేయడమేనని ఆయన నిర్వచిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన పదిసార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. డాక్టర్‌ గారి ప్రేమ మంత్రం ప్రజలకు పెద్దగా పట్టలేదు. పోటీ చేసిన ప్రతిసారీ ఆయనకు ధరావతు కూడా దక్కలేదు. ఇవేవీ ధాయ్‌లో ఉత్సాహాన్ని నీరుగార్చలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడంపై పెద్దగా ఆందోళన లేదని, ప్రజల్లో ప్రేమను పెంచేందుకు పాతికేళ్లుగా కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతమున్నది నిజమైన ప్రజాస్వామ్యం కాదంటున్నారు ఈ అభినవ శంకర్‌దాదా.  అసలు రాజకీయ పార్టీల అవసరం లేదని, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చోవాలని, ఎలాంటి ప్రచారాలను అనుమతించకూడదని, ప్రజలు ఎవరి ప్రభావం లేకుండా ఒకరిని ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికైనా తన సిద్ధాంతాలకు ప్రాచుర్యం వస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఈయనకు కొందరు శిష్యులు కూడా ఉన్నారు. వీళ్లకు ఆయన సిద్ధాంత ప్రవచనం చేస్తుంటారు. మరి ఇంటి ఖర్చులు ఎలాగంటారా? పెద్దవాళ్లిచ్చిన ఆస్తులపై అద్దెలతో డాక్టర్‌ సాబ్‌ కాలం వెళ్లబుచ్చుతున్నారు. 
మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ తుదివిడత ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు 

పెళ్లిలో ఓటు సందడి!  
ప్రజాస్వామ్య మనుగడ ప్రజల భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంటూ ఊదరగొట్టే పలువురు మేధావులు ఎన్నికలు వచ్చే సరికి ఓటేయడానికి బద్ధకిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన అతహుల్లాఖాన్‌ అందరిలాగా కాదు. సామాజిక కార్యకర్తగా ప్రజలను చైతన్యం చేయడం తన బాధ్యతగా భావిస్తారు. తాజాగా తన కుమారుడి పెళ్లి వేడుకలో ఓటు ప్రాముఖ్యత గురించి పోస్టర్లు అతికించడం ద్వారా ఖాన్‌ వార్తల్లో నిలిచాడు. పెళ్లిలో విందులు, బహుమతులతో పాటు అతిథులకు ఓటేయాలంటూ కరపత్రాన్ని ఇచ్చారు. ‘ఓటు వేయడం ప్రతిఒక్కరి నైతిక బాధ్యత. నా నగరంలో ప్రజలకు ఆ బాధ్యత మరొక్కమారు గుర్తు చేశాను’ అని ఆయన వినమ్రంగా చెబుతున్నారు. 

సెంటిమెంట్‌ పాయింట్‌ 
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎవరికివారు ప్రచారం ఉధృతం చేశారు. చాలామంది అభ్యర్థులు కేవలం ప్రచారంతో సరిపెట్టుకోకుండా సెంటిమెంటు, చిట్కాల ద్వారా అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. తమ అదృష్ట దీపాలుగా భావించే భార్యనో, చెల్లినో, కుమారుడినో ప్రచారంలోకి తీసుకుపోవడం, బియ్యాన్ని పంచడం, తులసి పూజలు చేయడం.. ఇలా ఒకటేమిటి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. సెంటిమెంట్‌ తమను గట్టెక్కించాలని మొక్కుకుంటున్నారు. ప్రధాన నిర్ణయాలు తీసుకునేముందు తల్లి కాళ్లకు నమస్కరించడం ఒక అభ్యర్థి అలవాటైతే, తులసి పూజ చేయకుండా బయటకు అడుగెయ్యకపోవడం మరొక అభ్యర్థి ఆచారం. తల్లి ఆశీర్వాదం తనకు ఎప్పుడూ కలిసివస్తుందని, ప్రతిరోజూ ఆమెకు నమస్కరించే ప్రచారం ఆరంభిస్తానని బీజేపీ అభ్యర్థి ఒకరు చెప్పారు. మరో కాంగ్రెస్‌ అభ్యర్థికి తన నియోజకవర్గంలోని ప్రతి గుడిని దర్శించిరావడం రివాజుగా మారింది. మహిళా అభ్యర్థుల్లో ఎక్కువమంది తులసి పూజకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పూజతో తమకు పాజిటివ్‌ శక్తి వస్తుందని వారు నమ్ముతారు. మధ్యప్రదేశ్‌ ప్రజల్లో బియ్యం పంచితే అదృష్టం వరిస్తుందని నమ్మకం ఉంది. అందుకే ఒక అభ్యర్థి మూడురంగుల బియ్యాన్ని నియోజకవర్గ ప్రజలందరికీ  పంచుతున్నాడు. ఏమాత్రం తగ్గనంటున్న ఆయన ప్రత్యర్థి ప్రజలందరికీ పసుపు బియ్యాన్ని పంచడం ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థులు పార్టీ గుర్తయిన కమలం పువ్వును  ఇస్తున్నారు. కొందరు కుటుంబసభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు మాత్రం ఈ సెంటిమెంట్లకు నవ్వుకుంటున్నారు. 

ఆ నాలుగు రాష్ట్రాలు 12 శాతం!
సీట్లలో మహిళల వాటా
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహిళలకు ఇచ్చిన సీట్లు చాలా తక్కువే. గతంలో ఇచ్చి్చన సీట్ల కంటే తక్కువనే చెప్పుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 15 మంది, కాంగ్రెస్‌ 13 మంది మహిళలకు సీట్లు ఇస్తే..  రాజస్తాన్‌లో బీజేపీ 21 మంది, కాంగ్రెస్‌ 27 మంది అతివలను బరిలో దింపాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 28, బీజేపీ 24 మంది మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చాయి. అయితే మిజోరంలో మాత్రం బీజేపీ ఆరుగురు మహిళలకు సీట్లివ్వగా.. కాంగ్రెస్‌ ఒక్కరినే బరిలో దింపింది. దేశవ్యాప్తంగా మహిళల ఓట్ల శాతం పెరుగుతోందని సర్వేల్లో వెల్లడవుతున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్యలో పెరుగుదల అనుకున్నంత వేగంగా లేదు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య 68. ఇది మొత్తం ఎంపీల సంఖ్యలో 12% మాత్రమే. చట్టసభల్లో మహిళల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన 33% రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చితే.. మనకు168 మంది మహిళా ఎంపీలు ఉంటారు. అయితే రాజకీయ ఏకాభిప్రాయం 
కుదరకపోవడంతోనే ఈ అంశం ఆలస్యమవుతోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top