పార్వతీపురం టీడీపీలో ముసలం

Disputes In TDP Activists - Sakshi

ఏఎంసీ చైర్మన్‌ పదవిపై అసంతృప్తి జ్వాలలు

ఎమ్మెల్యే నిర్ణయంపై మండిపడ్డ పట్టణ కౌన్సిలర్లు

అవిశ్వాసానికి మద్దతుగా జరిగిన కాగడాల ప్రదర్శనకు దూరం

బట్టబయలైన అభిప్రాయ భేదాలు

రాత్రి పదిగంటలవరకూ కొనసాగిన హైడ్రామా...

పార్వతీపురం : పార్వతీపురం తెలుగుదేశం పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి. పట్టణంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కాగడాల ర్యాలీకి కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు కలసి నిర్వహించిన కార్యక్రమానికి పట్టుమని పదిహేనుమంది కూడా ర్యాలీలో పాల్గొనకపోవడం విశేషం.

వాస్తవానికి కాగడాల ర్యాలీ చేపడుతున్న విషయం పట్టణ అధ్యక్షుడు కోలా వెంకట్రావు(బాబు) అందరికీ చెప్పాల్సి ఉంది. కాని ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే చిరంజీవులు కౌన్సిలర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఆయన నలుగురు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సమాచారాన్ని ఇవ్వక పోవడంతో కౌన్సిలర్లంతా ఏకమై కాగడాల ర్యాలీని బహిష్కరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడకు వచ్చిన పది మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ర్యాలీని మమ అనిపించారు.

ఏఎంసీ చైర్మన్‌ పదవే వివాదానికి కారణం

పార్వతీపురం పట్టణ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఈ నామినేటెడ్‌ పదవిని పార్టీని నమ్ముకుని పార్టీకి విశేష సేవల అందించేవారికి ఇవ్వడం ఆనవాయితీ. ఈ పదవిని తెలుగుదేశం పార్టీకి చెందిన 2వ వార్డు కౌన్సిలర్‌ బార్నాల సీతారామారావు, పట్టణ అధ్యక్షుడు కోలా వెంకట్రావు ఆశిస్తూ వస్తున్నారు. గతంలో కోలా వెంకట్రావును ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ప్రోత్స హిస్తూ వచ్చారు.

ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ మాత్రం బార్నాల సీతారామారావుకు ఛైర్మన్‌ పదవిని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సీతారామారావుకు ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎంతమాత్రం ఒప్పుకోలేదు. దీనివల్ల ఏడాది కాలంగా ఈ పదవి భర్తీ కావడంలేదు. ప్రస్తుతం ఆ పదవిని ఎమ్మెల్యే ఎవరికి తెలియకుండా బార్నాల సీతారామారావుకు ఇవ్వాలని సిఫారసు లేఖ రాసినట్టు తెలిసింది.

స్థానిక కౌన్సిలర్లను సంప్రదించకుండా... ఏ ఒక్కరి అభిప్రాయం తెలుసుకోకుండా ఉన్న పళంగా గతంలో వ్యతిరేకించిన సీతారామారావుకు ఎలా ఇచ్చారని కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ జయబాబు కార్యాలయంలో నిలదీశారు. ‘మిమ్మలను అడగకపోవడం నా తప్పే. నాకున్న ఒత్తిడి మేరకు అలా చేయాల్సి వచ్చింది తప్ప మిమ్ములను  ధిక్కరించి నేను ఏదీ చేయలేదు’ అని చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top