హిందువులను ఉగ్రవాదులతో పోల్చింది ఆర్కే సింగ్‌ : దిగ్విజయ్‌

Digvijaya Singh Said In Politics There Is No Promotion Or Demotion - Sakshi

ముంబై : ఈ సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌లో పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున రెండు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి బరిలో దిగితే.. అతనికి పోటీగా బీజేపీ ఓ సాధ్విని నిలబెట్టడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో భోపాల్‌లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ ఓ ఆంగ్లపత్రికతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ప్రస్తుతం భోపాల్‌.. కాంగ్రెస్‌కు చాలా ప్రతికూల నియోజకవర్గమని తెలిపారు. ఇలాంటి బలహీన ప్రాంతంలో పోటీ చేసి గెలవడాన్ని తాను ఓ సవాలుగా స్వీకరిస్తానన్నారు. తాను తొలుత తన స్వస్థలం రాజ్‌గఢ్‌ నుంచి పోటీ చేయాలి అనుకున్నాను అని తెలిపారు. కానీ కమల్‌ నాథ్‌, రాహుల్‌ గాంధీ తనను భోపాల్‌ నుంచి నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు.

పార్టీ నిర్ణయం ప్రకారమే తాను భోపాల్‌ నుంచి బరిలో దిగానని దిగ్విజయ్‌ తెలిపారు. రెండు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఇప్పుడు లోక్‌సభ బరిలో నిలవడం ప్రమోషనా.. డిమోషనా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఇలాంటివి ఉండవని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీ అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2011లో బురారిలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో ప్రణబ్‌ ముఖర్జీ తనను ప్రధాన కార్యదర్శిగా  బాధ్యతలు స్వీకరించమని కోరారన్నారు. అప్పుడు తాను యువకులకు ఆ అవకాశం ఇవ్వాలని చెప్పడంతో.. ఆ బాధ్యతలు రాహుల్‌ గాంధీకి ఇచ్చారని దిగ్విజయ్‌ గుర్తు చేశారు.

ఇకపోతే సాధ్వి ప్రజ్ఞా సింగ్‌.. దిగ్విజయ్‌ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ అలా ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలీదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెని ఇబ్బంది పెట్టిన వ్యక్తి శివరాజ్‌ సింగ్‌. రెండు సార్లు అతను.. సాధ్వీని అరెస్ట్‌ చేయించి జైలులో పెట్టాడ’ని తెలిపారు. ఇక బీజేపీ తనపై చేస్తోన్న హిందూ ఉగ్రవాద ఆరోపణలపై దిగ్విజయ్‌ స్పందిస్తూ.. తాను హిందు మతాన్ని ఆచరిస్తానని తెలిపాడు. ఈ పదాన్ని సృష్టించిన వ్యక్తి ఆర్కే సింగ్‌ అని పేర్కొన్నారు. కానీ మోదీ అతనికి టికెట్‌ ఇచ్చి మంత్రిని చేశారని దిగ్విజయ్‌ ఎద్దేవా చేశారు.

సాధ్విపై పోటీ చేయడం తెలీకా.. కష్టమా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనన్నారు దిగ్విజయ్‌. కానీ తాను ఎప్పటిలానే విజయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. అంతేకాక ప్రస్తుతం దేశంలో ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కశ్మీర్‌ అంశాలను వదిలేసి.. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని దిగ్విజయ్‌ మండి పడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top