‘బాహుబలి’ నేతల భార్యల పోరు! | Criminal Backgroung Political Leaders Wifes Contest in Siwan constituency | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’ నేతల భార్యల పోరు!

May 10 2019 9:00 AM | Updated on May 10 2019 9:00 AM

Criminal Backgroung Political Leaders Wifes Contest in Siwan constituency - Sakshi

కవితాసింగ్‌ , హీనా షహబుద్దీన్‌

బిహార్‌లో కండబలంతో ప్రజలను భయకంపితులను చేసే నేతలు చట్టసభలకు ఎన్నికవడం కొత్త కాదు. అయితే, లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ జరిగే ఈ రాష్ట్రంలోని సివాన్‌ నియోజకవర్గంలో నేరమయ రాజకీయ నేపథ్యం ఉన్న ఇద్దరు నేతల భార్యలు పోటీచేస్తున్నారు. అనేక రాజకీయ హత్యలతో దేశ ప్రజలందరికీ తెలిసిన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్‌ షహబుద్దీన్‌ భార్య హీనా, జేడీయూకు చెందిన ఇలాంటి మరో నేత అజయ్‌సింగ్‌ భార్య కవితాసింగ్‌ ఇప్పుడు సివాన్‌ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న షహబుద్దీన్‌ గతంలో నాలుగుసార్లు లోక్‌సభకు జనతాదళ్, ఆర్జేడీ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఆయన జైలుకు వెళ్లాక హీనా వరుసగా 2009, 2014 ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. హీనాపై 2009లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఓంప్రకాశ్‌సింగ్‌ 2014లో బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగి ఆమెను ఓడించారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తులో భాగంగా సివాన్‌ సీటును జేడీయూకు కేటాయించారు. నేర నేపథ్యంతో ఆర్థికంగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన వారిని హిందీ రాష్ట్రాల్లో ‘బాహుబలి’ నేతలని జనం పిలుస్తారు. ఆర్జేడీ మాదిరిగా పేరుమోసిన నేరగాళ్లకు నేరుగా టికెట్లు ఇవ్వడానికి బిహార్‌ సీఎం, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ఇష్టపడని కారణంగా సివాన్‌ టికెట్‌ అజయ్‌సింగ్‌ భార్యకు లభించింది. ముజఫ్పర్‌పూర్‌లోని అంబేడ్కర్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ అయిన 33 ఏళ్ల కవితకు ఎన్నికల్లో పోటీచేయడం కొత్త కాదు. ప్రస్తుతం ఆమె జేడీయూ దరౌంధా ఎమ్మెల్యే.

అజయ్‌తో పెళ్లికి దరఖాస్తు!
2011లో దరౌంధా ఎమ్మెల్యే, అజయ్‌ తల్లి జగమతోదేవి మరణించారు. ఉప ఎన్నికలో అజయ్‌కు టికెట్‌ ఇవ్వడానికి నితీశ్‌ నిరాకరిస్తూ, ‘‘వెంటనే పెళ్లి చేసుకుంటే నీ భార్యకు టికెట్‌ కేటాయిస్తాను,’’ అని చెప్పారనే విషయం ప్రచారంలోకి వచ్చింది. వెంటనే అజయ్‌ పత్రికల్లో తన వివాహ ప్రకటన ఇచ్చారు. రాజకీయ నేపథ్యంతో పాటు ఓటు హక్కు ఉన్న యువతులు తనను పెళ్లాడడానికి దరఖాస్తు చేసుకోవచ్చనీ, వారికి కనీసం పాతికేళ్లు ఉండాలని ఈ ప్రకటనల్లో అజయ్‌ సూచించారు. ఈ పెళ్లి ప్రకటన చూసి దరఖాస్తు చేసిన 16 మంది యువతుల్లో కవితను అజయ్‌ ఎంపిక చేసుకుని ఆమెను వివాహమాడారు. అజయ్‌ తల్లి మృతితో దరౌంధా అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీచేయడానికి కవితా సింగ్‌కు అవకాశం లభించింది. ఈ ఎన్నికలో గెలిచాక ఆమెకు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ టికెట్‌ దక్కింది. రెండోసారి కూడా ఆమె విజయం సాధించారు. ఇలా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత సివాన్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఆమెకు దక్కింది. అయితే, తన భర్త అజయ్‌ కన్నా పేరుమోసిన సీనియర్‌ ‘బాహుబలి’ షహబుద్దీన్‌ భార్య హీనా ఆమె ప్రధాన ప్రత్యర్థి కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. 

రెండుసార్లు ఓడినా హీనాకే ఆర్జేడీ టికెట్‌!
ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అత్యంత విధేయుడు, ఆప్తుడు అయిన షహబుద్దీన్‌ భార్యగా 2009లో సివాన్‌ లోక్‌సభ స్థానం నుంచి హీనా తొలిసారి పోటీచేశారు. అప్పుడు ఒక ఎన్నికల సభలో లాలూతో కలిసి పాల్గొన్నప్పుడు వేదికపై ముఖానికి ముసుగుతో హీనా దర్శనమిచ్చారు. తర్వాత నుంచి ఆమె ఎలాంటి ముసుగు లేకుండా ఓటర్లను కలుసుకోవడం అలవాటుగా మారింది. 46 ఏళ్ల హీనా చప్రా జేపీఎం కాలేజీలో పీజీ చదివారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత చంద్రశేఖర్‌ ప్రసాద్‌ సహా అనేక హత్య కేసుల్లో నిందితుడైన షహబుద్దీన్‌పై జనంతో పెరిగిన వ్యతిరేకత కారణంగా వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో హీనా ఓడిపోయారు. రెండు ప్రధాన ప్రాంతీయపక్షాల తరఫున ఇద్దరు ‘బాహుబలి’ నేతల భార్యలు సివాన్‌ బరిలోకి దిగడంతో పోటీ బాగా వేడెక్కింది. ఇక్కడి ఎన్నికల ఫలితాన్ని నేరమయ రాజకీయాలతోపాటు మతం, కులం కూడా ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గస్థాయిలో బలమున్న సీపీఐ–ఎంఎల్‌(లిబరేషన్‌) తరఫున అమర్‌నాథ్‌ యాదవ్‌ పోటీకి దిగారు. 2014లో ఆయన 9 శాతానికి పైగా ఓట్లు చీల్చుకున్నారు. ఆయన పోటీ వల్ల తుది ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement