‘రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తాం’

CPM Madhu, CPI Ramakrishna Pay Tribute To Karl Marx - Sakshi

సాక్షి, విజయవాడ: కారల్‌ మార్క్స్‌ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్‌ మార్క్స్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం కార్యదర్శి మధు మండిపడ్డారు. ప్రతి రోజు రాష్ట్రంలో మహిళలపై ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితులు మారడం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని మధు టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. వామపక్ష పార్టీలతో కలసి అత్యాచారాలకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

లాలూచీ రాయకీయాలు చేస్తే సహించం..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 8న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నరేంద్రమోదీ ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరగడంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో టీడీపీకి అంతే ఉందని రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణంరాజు లాలూచీ రాయకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులతో చంద్రబాబు నాయుడిని పోల్చినందుకు రఘురామకృష్ణంరాజు నాలుక చీరేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరనీ.. ఇలా అవాకులు చెవాకులు పేలుతూ స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తే ఊరుకునేది లేదని రామకృష్ణ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top